వయస్సెంతో.. కేసులన్నీ

by Shamantha N |
వయస్సెంతో.. కేసులన్నీ
X

మైనర్‌పై యోగీ సర్కార్ 15 కేసులు

ఆ బాలుడి వయస్సు 15 ఏండ్లు. ఈ అంకెపై ముచ్చటపడిన యూపీలోని యోగి సర్కార్.. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నందుకు అతనిపై ఏకంగా 15 కేసులు నమోదు చేసింది. సాధారణ జైలులో 42 రోజులపాటు జీవితం గడిపేలా చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తొలి నుంచీ పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక ఆందోళనలను అణచివేస్తోంది. ఇందుకోసం క్రూర విధానాలను అనుసరిస్తోంది. సీఏఏ చట్టం వచ్చిన తర్వాత ఆందోళనల్లో ఎక్కువ మంది మృతిచెందింది, పెద్ద ఎత్తున దేశ ద్రోహం కేసులు ఉత్తరప్రదేశ్‌లోనే నమోదు కావడం ఇందుకు నిదర్శనం.
ఈ క్రమంలో యోగి సర్కార్ మరో ఘన కార్యం చేసింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నందకు ఓ మైనర్‌ 42 రోజులపాటు సాధారణ జైలులో గడిపేలా చేసింది.
పౌరసత్వ సవరణ చట్ట (సీఏఏ) వ్యతిరేక ఆందోళనల్లో 15 ఏండ్ల బాలుడిని డిసెంబర్ 19న పోలీసులు అరెస్టు చేశారు. బహుశా ఆ బాలుడి వయస్సు లక్నో పోలీసులకు నచ్చిందేమో? ఆ వయస్సుకు సరిపోయేన్ని అంటే.. 15 కేసులు నమోదు చేశారు. అందులోనూ హత్యాయత్నం, మారణాయుధాలతో అలర్లు సృష్టించడం తదితర తీవ్ర నేరాల కింద కేసులు పెట్టారు. అంతటితో ఆగకుండా కోర్టులో వయస్సు ఎక్కువ చెప్పాలని భయభ్రాంతులకు గురిచేశారు. దిక్కుతోచని ఆ బాలుడు తన వయస్సు 18 ఏండ్లు చెప్పాడు. ఫలితం.. గత 42 రోజులుగా సాధారణ జైలులో జీవితం గడుపుతున్నాడు.
ఇలా బయట పడింది..
డిసెంబర్ 19న.. సీఏఏకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇందులో ప్రభుత్వం, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ నష్టాన్ని ఆందోళనకారుల నుంచే వసూలు చేస్తామని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఆ 15 ఏండ్ల బాలుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సొమ్ము రికవరీ నోటీసులను జారీ చేశారు. అతని తరఫున యషబ్ హుసెయిన్ రిజ్వీ కేసును వాదిస్తున్నాడు. ఆ బాలుడి ఆధార్‌కార్డును పరిశీలించిన రిజ్వీ ఆశ్యర్యపోయాడు. అందులో ఆ బాలుడి వయస్సు 15 ఏండ్లని ఉంది. ఈ విషయమై బాలుడిని న్యాయవాది ఆరా తీయగా.. వుమర్ బడా కే బతావో (వయస్సు పెంచి చెప్పు) అని పోలీసులు బెదిరించడంతో భయాందోళనకు గురై కోర్టులో తన వయస్సు 18 ఏండ్లుగా తెలిపాడు. దీంతో సాధారణ జైలులో బెయిల్ లేకుండా మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై లక్నో పోలీసు కమిషనర్‌ వద్ద న్యాయవాది రిజ్వీ ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బాలుడిపై జువైనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, జువైనల్ హోంకు పంపాల్సి ఉండగా, ఎందుకు అలా చేయలేదని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed