హరీశ్‌ రావుకు అదనపు బాధ్యతలు.. భయంలో తెలంగాణ మంత్రులు..!

by Anukaran |   ( Updated:2021-11-10 03:43:39.0  )
హరీశ్‌ రావుకు అదనపు బాధ్యతలు.. భయంలో తెలంగాణ మంత్రులు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుతం వైద్యశాఖ అని పేరు వింటేనే మంత్రులు భయపడుతున్నారు. ఎందుకంటే ఈ శాఖ బాధ్యతలు నిర్వహించిన ముగ్గురు నేతలు కూడా వివిధ సమస్యల్లో చిక్కుకోవడంతో ఉమ్మడి ఏపీలో దేవదాయ శాఖలాగే ఇప్పుడు ఆరోగ్యశాఖ అంటేనే హడలిపోతున్నారు. భూ వ్యవహారంలో మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ అయ్యారు. ఈటల తర్వాత ఈ శాఖను సీఎం కేసీఆర్ చేతికి బదిలీ చేయగా ఇప్పుడు.. అక్కడి నుంచి మళ్లీ మంత్రి హరీశ్​రావుకు అప్పగించారు. హరీశ్​రావు చేతిలో ఉన్న రెండు శాఖలు కూడా ఇప్పటి వరకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ​చేసినవే కావడం మరో విశేషం.

ఇప్పటికే ఈటల తర్వాత వేటు హరీశ్​రావుపైనే అంటూ ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేశాయి. అధికార పార్టీలో అప్పుడప్పుడు చేసే ప్రకటనలతో కూడా పలుమార్లు హరీశ్​రావు అంశం చర్చకు వస్తూనే ఉంది. ఇప్పుడు హుజురాబాద్‎లో ఓటమి తర్వాత హరీశ్​రావు కేంద్రంగా చాలా ప్రచారమే జరుగుతోంది. ఇదే సమయంలో వైద్యారోగ్య శాఖ అప్పగించడంతో ఈ ప్రచారం మరింత ఎక్కువైంది.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య శాఖకు ముగ్గురు నేతలు మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. ఈ శాఖను నిర్వర్తిస్తూ ఉద్వాసనకు గురైన వారిలో మంత్రి ఈటల రాజేందర్​ది రెండో స్థానం. తొలిస్థానం మాజీ మంత్రి, స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యది. 2014 జనవరిలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న రాజయ్యను క్యాబినెట్ నుంచి తొలగించారు. కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో రాజయ్య పై వేటు పడగా రెండోసారి ఈటల రాజేందర్​ బలయ్యారు. అదే విధంగా మొదటిసారి వైద్యారోగ్య శాఖ మంత్రిగా పని చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా నకిలీ సర్టిఫికెట్ల వివాదంలో ఇరుక్కున్నారు. అది ఇంకా అప్పుడప్పుడు చర్చకు వస్తూనే ఉంది. లక్ష్మారెడ్డి మున్నాభాయ్ ఎంబీబీఎస్ డాక్టర్ అంటూ ఎంపీ రేవంత్ అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు. ఆ తరువాత 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆరోగ్య శాఖ బాధ్యతలను ఈటల రాజేందర్‌కు అప్పగించగా.. లక్ష్మారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు.

రాజకీయాలను సెంటిమెంటును విడదీసి చూడలేం. దాదాపుగా ఎక్కువ మంది రాజకీయ నేతలు ముహుర్తాలు, సెంటిమెంట్లను నమ్మేవాళ్లే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అయితే నేతలకు ఇది మరికాస్త ఎక్కువే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యారోగ్య శాఖలోనే ఎందుకిలా జరుగుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రులకు కలిసి రావడం లేదా అనే నమ్మకాలు, విశ్వాసాలపై రాజకీయ వర్గాలలో మరోసారి చర్చకు దారితీస్తుంది.

ఇంతకుముందు ఉమ్మడి ఏపీలో మంత్రుల శాఖలకు సంబంధించి ఓ సెంటిమెంట్ ఉండేది. అప్పట్లో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఎవరికీ రాజకీయంగా కలిసి రాలేదు. ఆ శాఖ మంత్రిగా పనిచేసిన పలువురు నేతలు తదుపరి ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం.. లేదంటే పదవులు దక్కకపోవడం ఉండేదని చెప్పుకుంటారు. అందుకే అప్పట్లో ఆ శాఖ బాధ్యతలు తీసుకోవాలంటేనే కాస్తా వెనకా ముందూ ఆలోచించే వాళ్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈ తరహా సెంటిమెంట్ వైద్య, ఆరోగ్య శాఖలో కనిపిస్తుందని రాజకీయ ప్రముఖులు విశ్లేషించుకుంటున్నారు.

అనధికారికంగా హరీశే

అంతకుమందు కేసీఆర్ కరోనా బారినపడిన తర్వాత మంత్రి హరీశ్ రావే వైద్యారోగ్యశాఖకు సంబంధించిన పలు సమీక్షలను నిర్వహించారు. ఆ తరువాత ఆయనకు ఈ శాఖ అప్పగించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే.

ఇక హరీశ్​రావు చేతిలో ఉన్న రెండు శాఖలను కూడా మాజీ మంత్రి ఈటల రాజేందర్​ గతంలోనూ నిర్వర్తించినవే. తొలి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ, రెండోసారి వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్​ పని చేశారు. అయితే ఇప్పటికే ఈటల రాజేందర్​, హరీశ్​రావు మిత్రులనేది అన్నివర్గాల్లో ఉన్న ప్రచారమే. అంతేకాదు.. కేసీఆర్​పెట్టిన బాధలకు వీరిద్దరు కలిసి తెల్లవార్లు బాధపడినట్టు కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి పంపించిన తర్వాత హుజురాబాద్​ఉప ఎన్నిక రాగా.. అక్కడ మంత్రి హరీశ్​రావే బాధ్యత తీసుకున్నారు. చివరకు అధికార పార్టీ ఓటమిని మూటగట్టుకుంది. మొత్తానికి ముందు నుంచీ ఈటల రాజేందర్​పై అధికార పార్టీ బాణంగా హరీశ్​రావునే వినియోగిస్తుండగా.. ఇప్పుడు ఆయన చేసిన శాఖలు కూడా హరీశ్​రావు చేతికే ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed