మంత్రి, చైర్మన్.. మధ్యలో హారిక

by Anukaran |
Minister vs. Chairman .. Dettadi Harika in the dispute
X

దిశ, వెబ్ డెస్క్ : దేత్తడి హారిక తెలంగాణ టూరిజం శాఖలో చిచ్చుపెట్టిందా..? ఇప్పటికే అంటిముట్టనట్టు ఉంటున్న మంత్రి, చైర్మన్ మధ్య అంతరాన్ని మరింత పెంచిందా..? ఇన్నాళ్లు అంతర్గతంగా రగులుతున్న వర్గపోరు దేత్తడి రూపంలో బయట పడిందా..? ఈ సందేహాలన్నీటికి ఆ శాఖలోని కొందరు అవుననే అంటున్నారు. తెలంగాణ పర్యాటక శాఖ చైర్మన్ గా ఉప్పుల శ్రీనివాస్ గుప్తా నియామకం నుంచి ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అసంతృప్తిగా ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్య సఖ్యత లేదన్నది ఆ శాఖలో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు దేత్తడి హారికను టూరిజం డిపార్ట్ మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా చైర్మన్ నియమించడంతో మంత్రి జీర్ణించుకోలేకపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ పర్యాటక శాఖకు ఇప్పటి వరకు బ్రాండ్ అంబాసిడర్ లేరు. అయితే బ్రాండ్ అంబాసిడర్ అవసరం ఉండి నియమించుకోవాలంటే.. నిబంధనల ప్రకారం సీఎం లేదా ఆ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, టూరిజం ఎండీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటిని పట్టించుకోకుండా చైర్మన్ ఏకపక్షంగా దేత్తడిని బ్రాండ్ అంబాసిడర్ నియమించారనే విమర్శలు వస్తున్నాయి. అన్ని విషయాల్లో ప్రణాళిక బద్ధంగా, సావదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే చైర్మన్.. ఈ విషయంలో తొందర పడ్డారనే టాక్ ఆ శాఖ నుంచే వినిపిస్తోంది.

దేత్తడి హారిక తెలంగాణ వాసి కావడం, లక్షాలాది మంది ఫాలోవర్స్ ఉన్న యూట్యూబ్ స్టార్.. బిగ్ బాస్ 4 సీజన్ లో ఫైనల్ వరకు వచ్చిన అమ్మాయి. మరోవైపు చైర్మన్.. హారిక సామాజిక వర్గం ఒకటే కావడం.. ఆమె కుటుంబంతో దూరపు బంధుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ అర్హతలతోనే చైర్మన్ ఉప్పుల శ్రీనివాస్ గుప్తా ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హారిక తెలంగాణ యువతి కావడంతో అటు సీఎం, ఇటు మంత్రి అడ్డు చెప్పరనే భావనతోనే ఆమెకు నియామక పత్రం అందజేసినట్టు సమాచారం. అయితే మాట వరసకైన తనకు చెప్పకుండా బ్రాండ్ అంబాసిడర్ ను ఎలా నియమిస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే దేత్తడి హారిక ఎవరో తనకు తెలియదని ఆయన చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి. ఆ వ్యాఖ్యల అనంతరం టూరిజం శాఖ దేత్తడి వివరాలను తమ వెబ్ సైట్ నుంచి తొలగించింది. ఈ చర్యలతో మనస్థాపం చెందిన హారిక.. స్వచ్ఛందంగా బ్రాండ్ అంబాసిడర్ గా తప్పుకుంటున్నానని ప్రకటించింది. అయితే ఈ గొడవను తగ్గించడానికి ఆ శాఖ కొత్త పల్లవిని అందుకుంది. బ్రాండ్ అంబాసిడర్ ను కేవలం హరిత హోటల్స్ ప్రమోషన్ కోసమే చైర్మన్ నియమించారని, టూరిజం శాఖకు సంబంధం లేదని ఓ వాదనను వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ రచ్చ ఇంతటితో ఆగినప్పటికీ ఇప్పటికైనా మంత్రికి, చైర్మన్ మధ్య వచ్చిన గ్యాప్ తగ్గుతుందా..? ఇద్దరు కలిసి పని చేస్తారా..? మరో బ్రాండ్ అంబాసిడర్ ను నియమిస్తారా..? అని తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే!!

Advertisement

Next Story

Most Viewed