పాలమూరు పరిస్థితులు మారాయి.. మినిస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |   ( Updated:2021-07-26 04:20:04.0  )
Minister Srinivas Goud
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లా యువతీ, యువకులతో పెళ్లి సంబంధాలు కలుపుకోవడానికి ఒకప్పుడు భయపడే వారని, ప్రస్తుతం సంబంధాలకు క్యూ కడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌ హాల్‌లో లబ్దిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు పాలమూరు కరువు కాటకాలతో అల్లాడుతూ వలసలు, దుర్భర బతుకులతో గడిచిందని, ఆ సమయంలో సంబంధాలు కలుపుకోవడానికి ఇతర ప్రాంతాల వారు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయని, ఉమ్మడి పాలమూరు జిల్లా పూర్తిగా, అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని అన్నారు. తాగునీరు, సాగునీరు పుష్కలంగా అందుతోందని, రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయని వెల్లడించారు. రోడ్లు, పరిశ్రమల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భూముల విలువలు ఒక్కసారిగా పెరిగాయి.

త్వరలోనే ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందుతోందని హామీ ఇచ్చారు. హైదరాబాద్, తదితర నగరాల్లో ఉండేవారు కూడా ఇక్కడికి వచ్చి నివాసాలు ఏర్పరచుకునే ఈ విధంగా అభివృద్ధి జరిగిందని మంత్రి చెప్పుకొచ్చారు. హత్యలు, గొడవలు పూర్తిగా తగ్గాయన్నారు. ఈ అభివృద్ధిని జిల్లాలో సంబంధాల కోసం ఇతర ప్రాంతాల ప్రజలు క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పాలమూరు జిల్లా అభివృద్ధి చెందుతోంది. ఇటీవల సీడ్ బాల్స్ తయారీలో పాలమూరు జిల్లా మహిళలు గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. మన రాష్ట్రంలోని రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది అని మంత్రి చెప్పారు. ఇంతగా అభివృద్ధి చేస్తున్నా.. కొంతమంది ఇక్కడి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారికి ఎలా బుద్ధి చెప్పాలో మీరే గుర్తించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, డీసీసీబీ చైర్మన్ కోరమని వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed