ఆ సమయంలోనే వరి ధాన్యం కొంటాం.. రైతులకు మంత్రి సింగిరెడ్డి క్లారిటీ

by Shyam |   ( Updated:2021-09-21 12:02:09.0  )
ఆ సమయంలోనే వరి ధాన్యం కొంటాం.. రైతులకు మంత్రి సింగిరెడ్డి క్లారిటీ
X

దిశ, నాగర్‌కర్నూల్‌: మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పంట మార్పిడి చేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతులకు కీలక సూచన చేశారు. మంగళవారం కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, ఎంపీ రాములు, జడ్పీ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్‌లతో కలిసి ప్రారంభించారు

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. వానాకాలం పంటను యథావిధిగా కొంటామని.. యాసంగి నుంచి వరికి బదులు ప్రత్యామ్నాయ నూనె పంటలను వేసుకోవాలన్నారు. వానాకాలంలో వేసిన పంటను కొనడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సుముఖత చూపించిందని.. మొత్తం ధాన్యాన్ని కొని మిల్లులకు ఇస్తున్నామన్నారు. కానీ, యాసంగిలో బియ్యం, నూకలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందన్న కారణంతో ఎఫ్‌సీఐ ప్రస్తుతం సిద్ధంగా లేనందున.. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ఆలోచించాలన్నారు.

కేవలం వరి ధాన్యం మాత్రమే వేయాలనుకునే రైతులు ఒక నెల పంటను ముందుకు జరుపుకుని ఫిబ్రవరి, మార్చి వరకు కోతకు వచ్చే విధంగా సన్నద్ధం కావాలన్నారు. ప్రస్తుతం నూనె గింజ పంటలకు మంచి డిమాండ్ ఉందని, నువ్వులు, ఆవాలు, కుసుమలు, వేరుసెనగ వంటి పంటలు వేసుకోవాలన్నారు. పామాయిల్ పంటకు సైతం మంచి డిమాండ్ ఉందని.. ఈ సంవత్సరం కేవలం 30 వేల పామాయిల్ మొక్కలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. రైతులు ఇప్పటి నుండే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వచ్చే సంవత్సరం నుండి మొక్కలు అందించడం, సబ్సిడీ కల్పించడం జరుగుతుందని మంత్రి సింగిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed