వలస కూలీల పిల్లల రక్షణ మా బాధ్యత

by Shyam |   ( Updated:2020-03-28 05:10:33.0  )
వలస కూలీల పిల్లల రక్షణ మా బాధ్యత
X

దిశ, వరంగల్: లాక్‌డౌన్ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వలస కూలీలకు భోజన, వసతి, ఇతర ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని గొల్లచర్ల, తెల్లబండ, ఇతర తండాలకు మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుంచి మిర్చి ఏరేందుకు, ఇటుకల బట్టిల్లో పనిచేయడానికి వచ్చిన కూలీల పరిస్థితులను మంత్రి శనివారం పరిశీలించారు. వలస కూలీలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు, భోజన వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. కూలీల పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల నుంచి పాలు, గుడ్లు, ఆహార పదార్థాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి కేంద్రం, ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వసతులన్ని అందేలా చూడాలని కలెక్టర్ వీపీ గౌతమ్‌కు సూచించారు. వచ్చే నెల 14 వరకు లాక్ డౌన్ ఉన్నందున కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వారి కుటుంబాలకు నెలకు 12 కిలోల రేషన్ బియ్యం, రూ.1500 అందజేయాలన్నారు. కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు మందు లేదని, దీనికి స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని వివరించారు.

Tags : minister satyavathi rathod, warangal, labour children, govt will protect, corona, lock down

Advertisement

Next Story

Most Viewed