కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేతగా రాహుల్?

by Shamantha N |
కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేతగా రాహుల్?
X

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు పియూష్ గోయల్ బుధవారం రాజ్యసభ సభాపక్ష నేతగా నియమితులయ్యారు. అంతకుముందు ఈ బాధ్యతలు నిర్వర్తించిన తావర్‌చంద్ గెహ్లట్ కర్ణాటక గవర్నర్‌గా వెళ్లడంతో పియూష్ గోయల్‌కు ఈ పదవి దక్కింది. ఆయన నియామకాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నిర్ధారిస్తూ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న గోయల్‌.. కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ సహా కీలకమైన కన్జూమర్ ఎఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, టెక్స్‌టైల్స్ మంత్రిత్వశాఖలలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తావర్ చంద్ రాజ్యసభ సభాపక్ష నేతగా ఉన్నప్పుడు పియూష్ ఉప సభాపక్ష నేతగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలతో మంచి సంబంధాలున్న గోయల్‌‌ను ఈ పదవిలో నియమించడం ద్వారా సభ సజావుగా సాగడంలో కీలక పాత్ర పోషిస్తారని కేంద్రం భావిస్తున్నది. కాగా, ఈ నెల 19నుంచి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కరోనా కట్టడి, సాగు చట్టాల అంశాలపై కేంద్రంపై ప్రతిపక్షాలు విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ లోక్‌సభా పక్షనేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు కాంగ్రెస్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుత లోక్‌ సభాపక్ష నేతగా అధిర్ రంజన్ చౌదరీని తొలగించడం ఖాయంగానే కనిపిస్తున్నది. కానీ, తదుపరి నేతపై ఇంకా పూర్తి స్పష్టత లేదు. మరోవైపు పార్టీపై అసమ్మతి తెలియజేస్తూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి అప్పట్లో లేఖ రాసిన 23మంది నేతల్లో ఒకరికి ఈ అవకాశం దక్కుతుందనే ఊహాగానాలూ వినిపిస్తుండటం గమనార్హం.

Advertisement

Next Story