Covid Hospital: అనంతగిరిలో కొవిడ్ ఆసుపత్రి..

by Sridhar Babu |   ( Updated:2021-05-21 02:51:48.0  )
Covid Hospital: అనంతగిరిలో కొవిడ్ ఆసుపత్రి..
X

దిశ ,వికారాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వికారాబాద్ అనంతగిరి లో 200 పడకల కొవిడ్ ఆసుపత్రి ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వికారాబాద్ అనంతగిరి లోని టి.బి ఆసుపత్రిని శుక్రవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, కలెక్టర్ పౌసుమి బసు, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లు మోతిలాల్, చంద్రయ్య , జిల్లా వైద్యాధికారి సుధాకర్ షిండే, వికారాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల తో కలిసి కొవిడ్ పై సమీక్షించారు. కరోనా మొదటి, రెండవ దశ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ అనునిత్యం సమీక్షిస్తూ ఆదేశాలు ఇస్తున్నారని అన్నారు.

కేసీఆర్ స్వయంగా రెండు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిని, నేడు వరంగల్ ఆసుపత్రిని సందర్శించి కరోనా రోగులకు మనో ధైర్యం ఇచ్చారని, వైద్యులు, సిబ్బందికి ప్రోత్సహించి వారిలో మరింత ఆత్మస్థైర్యం నింపారని అన్నారు. వికారాబాద్ లో డ్రగ్ స్టోర్ ను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఆర్టీపీసీఆర్ సెంటర్ త్వరలో ప్రారంభం కానుందని పేర్కొన్నారు. వికారాబాద్ లో నేటి నుండి సిటీ స్కాన్ 2500 రూపాయలకే చేయనున్నట్లు తెలిపారు.

ప్రయివేటు ఆస్పత్రుల్లో ఫీజుల నియంత్రణ కు కలెక్టర్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను వసూలు చేయాలని ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు ఆదేశించారు. ఇప్పటి నుండే రానున్న మూడో వేవ్ కోసం సంసిద్ధులు కావాలన్నారు. చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఐసోలేషన్ సెంటర్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వికారాబాద్ అనంతగిరి లో 200 పడకల ఆస్పత్రి లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతగిరి లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే తాండూరు లో మాత శిశు సంరక్షణ కేంద్రం లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేంద్రం లో కరోనా కు చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న వికారాబాద్ అనంతగిరిలో అన్ని వసతుల తో ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed