మంత్రిని ఆకట్టుకున్న విశాఖ బాలిక 

by Anukaran |
మంత్రిని ఆకట్టుకున్న విశాఖ బాలిక 
X

దిశ, ఏపీ బ్యూరో: సొంతూరి నుంచే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే వ్యవస్థకు ఏపీని నిలబెట్టనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యక్తం చేశారు. గురువారం ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ సీఈఓ రోషిణీ నాదర్ మల్హోత్రాతో ఢిల్లీ నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. విశాఖపట్నంలో అత్యున్నత స్థాయి నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఐటీ హబ్ గా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు.

ఇటీవల మంత్రి గౌతమ్ రెడ్డి విశాఖలో పర్యటించినప్పుడు ఓ బాలిక ప్రతిభ, వర్కింగ్ స్కిల్ తనను ఎంతగానో ఆకట్టుకున్న విషయాన్ని మంత్రి మేకపాటి ప్రస్తావించారు. ఐటీ వృద్ధికి హెచ్ సీఎల్ ప్రభుత్వ భాగస్వామ్యంతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని ఆహ్వానించారు. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తరహా అత్యాధునిక కోర్సులకు చిరునామాగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్శిటీకి తోడ్పాటునందించాలని మంత్రి కోరారు.

హెచ్‌సీఎల్ సీఈవో రోషిణీ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. ఏపీలో చాలా తక్కువ ఖర్చుకే హబ్ ల ఏర్పాటుకు అవసరమైన భూములు, ప్రతిభ కలిగిన యువత పుష్కలంగా ఉన్నట్లు ఆమెకు వివరించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇంటర్ చదివినవారికి టెక్బీ కార్యక్రమం ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు సీఈవో మంత్రికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story