మంత్రి మల్లారెడ్డి భూములపై న్యాయ విచారణ చేపట్టాలి : రాథోడ్ సంతోష్

by Shyam |
DYFI leader
X

దిశ, కుత్బుల్లాపూర్ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి భూములపై న్యాయ విచారణ చేపట్టాలని డీవైఎఫ్ఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. షాపూర్ నగర్‌లో ఆదివారం జరిగిన డీవైఎఫ్ఐ కుత్బుల్లాపూర్ మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఉండేందుకు కనీసం 60 గజాల ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటిది మంత్రి మల్లారెడ్డికి 600 ఎకరాలు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఒక్కరికి 54 ఎకరాల కన్నా ఎక్కువగా ఉండకూడదని, స్వయంగా మంత్రి మల్లారెడ్డి మీడియా సమావేశంలోనే వెల్లడించడం జరిగిందన్నారు.

మల్లారెడ్డి భూములపై అనుమానాలున్నాయన్నారు. 2014 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూములు, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలనిస్తామని హామీనిచ్చి మరిచారన్నారు. న్యాయ విచారణ చేపట్టి పేదలకు ఇండ్ల స్థలాలుగా కేటాయించాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మంత్రులు, ప్రజాప్రతినిధులకే తప్పా, 1200 మంది అమరులు, ఉద్యమకారులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు లక్ష్మణ్, జాకీర్, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed