రాజ్‌నాథ్‌ సింగ్‌కు కేటీఆర్ లేఖ.. ఎందుకో తెలుసా?

by Shyam |   ( Updated:2021-07-15 11:22:04.0  )
రాజ్‌నాథ్‌ సింగ్‌కు కేటీఆర్ లేఖ.. ఎందుకో తెలుసా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముసివేసిన మిలిటరీ అథారిటీ రోడ్లను తెరిపించాలని రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. మిలటరీ రోడ్లను మూసివేయకుండా మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయడంతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. ప్రస్తుతం లోకల్ మిలిటరీ అథారిటీ తన పరిధిలోని అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్డు, వెల్లింగ్టన్ రోడ్డు, ఆర్డినెన్స్ రోడ్డు వంటి కీలకమైన నాలుగు రోడ్లను కోవిడ్ నేపథ్యంలో మూసివేసిందని దీంతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం మే, జూన్ నెలల్లో తీసుకున్న కొవిడ్ నియంత్రణ చర్యలతో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయని, ప్రస్తుతం అదుపులోనే కరోనా పేరుతో తాజాగా.. మరోసారి రోడ్ల మూసివేతకు చర్యలు చేపట్టడం బాధాకరమన్నారు.

లోకల్ మిలటరీ అథారిటీ, స్థానిక కంటోన్మెంట్ బోర్డుకు సంబంధం లేకుండా రోడ్ల మూసివేతకు పాల్పడుతోందని, కంటోన్మెంట్ యాక్ట్‌లో ఉన్న సెక్షన్ 258 కు ఇది పూర్తి విరుద్ధమన్నారు. చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాల మేరకు మాత్రమే రోడ్డు మూసివేసే ప్రక్రియ ఉండాలని అందుకు విరుద్ధంగా చేపడుతున్నారన్నారు. రక్షణ శాఖ ఆదేశాలను సైతం స్థానిక మిలిటరీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రోడ్ల మూసివేతకు సంబంధించి పలు సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని, లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైన స్పందించి మూసివేసిన రోడ్లను తెరిపించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed