టెక్స్‌టైల్ ఇండస్ట్రీ బలోపేతానికి మంత్రి కేటీఆర్ కీలక సూచనలు

by Shyam |
KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం టెక్స్టైల్ పరిశ్రమ కు ప్రకటించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకానికి సంబంధించి మరిన్ని అంశాలను జోడించడం ద్వారా టెక్స్టైల్ పరిశ్రమ పురోగతిని మరింతగా బలోపేతం చేసేందుకు అవకాశం ఉందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ పథకం ప్రకటించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా చైనా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి టెక్స్టైల్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వివిధ దేశాలను ఆకర్షించవచన్నారు. ఈ సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. అయితే ఈ సందర్భంగా ఆయన ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు పరిశ్రమకు ఉపయుక్తంగా మార్చేందుకు అవసరమైన పలు సలహాలు సూచనలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు శుక్రవారం రాసిన లేఖలో తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల్లో ఈ పథకానికి సంబంధించిన ప్రోత్సాహకాలు మ్యాన్ మేడ్ ఫైబర్ కు మాత్రమే వర్తిస్తాయని పేర్కొన్నారని, అయితే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా టెక్స్టైల్ ఉత్పత్తుల్లో 50 శాతానికి పైగా ఉన్న పత్తి (కాటన్ సెగ్మెంట్)ను ప్రోత్సాహకాల ఈ విషయంలో పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. కాటన్ ఆధారిత టెక్స్టైల్ ఉత్పత్తులు చేసే వారికి సైతం ఈ పథకం ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తే అటు పరిశ్రమతో పాటు పత్తిని అధికంగా పండించే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లోని రైతాంగం వరకు అందరికీ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. తద్వారా అన్ని రకాల ఫైబర్తో కూడిన నూతన పెట్టుబడులు టెక్స్టైల్ రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. కాటన్ సెగ్మెంట్కు సైతం ఈ ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలో ఆశిస్తున్న 7.5 లక్షల ఉద్యోగాలను వేగంగా కల్పించే అవకాశం ఉంటుందన్నారు.

మరోవైపు ఈ ప్రోత్సాహకాలు పొందేందుకు నిర్ణయించిన నిర్ణీత కనీస పెట్టుబడిని తగ్గించాలని కోరారు. మ్యాన్ మేడ్ ఫైబర్ సెగ్మెంట్లో 300 కోట్ల రూపాయల కనీస పెట్టుబడిని ఈ పథకంలో ప్రోత్సాహకాలు పొందేందుకు అర్హతగా నిర్ణయించారన్నారు. ప్రపంచంలోని చైనా లాంటి దేశాలతో పోటీ పడాలంటే భారీ ఎత్తున ఈ రంగంలో పెట్టుబడుల ద్వారానే సాధ్యమవుతుందన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకుంటూనే, ఈ రంగంలో ఆధునాతన యంత్రాలతో పెట్టుబడి పెట్టే స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ లకు సైతం ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందన్నారు. గార్మెంట్ రంగంలో నిర్ణయించిన కనీస 100 కోట్ల పెట్టుబడి పరిమితిని 50 కోట్లకు తగ్గించాలని లేకుంటే ఈ వంద కోట్ల రూపాయల పెట్టుబడితో ఒకే చోట సుమారు ఆరు వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించే స్థాయిలో యూనిట్లు ఏర్పాటు చేస్తేనే ఈ ప్రోత్సాహకాలు అందే అవకాశం ఉంటుందన్న మార్గదర్శకాలను కొంత సవరించాలని కోరారు. గార్మెంట్ రంగంలో 50 కోట్ల పెట్టుబడితోనూ భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. దేశంలో ఉన్న రెడీమేడ్ గార్మెంట్ సెగ్మెంట్ లో అనేకం చిన్న యూనిట్ లే ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని, ఇవన్నీ కూడా టెక్స్టైల్ రంగం లో ఉన్న ప్రముఖ సంస్థలకు సేవలు అందిస్తున్న ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ చిన్న యూనిట్లను సైతం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలో ఉన్న భారీ టెక్స్టైల్ పార్క్ లకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం ఉన్నదని, టెక్స్టైల్ రంగం లో భారీగా పెట్టుబడులు రావాలంటే, పెద్ద ఎత్తున భూమి మరియు మౌలిక వసతుల కల్పన అవసరమని, ఇది కేవలం మెగా టెక్స్టైల్ పార్కుల ద్వారానే సాధ్యం అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో మెగా టెక్స్టైల్ పార్కులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇందుకు ఉదాహరణ అని, ఇక్కడ ఇప్పటికే యంగ్ వన్ వంటి అంతర్జాతీయ సంస్థతో పాటు దేశంలో ప్రముఖ గార్మెంట్ ఇండస్ట్రీ అయిన కిటే క్స్ గ్రూప్ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.

దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ పథకాన్ని తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ సహకారంతో ఇలాంటి పార్క్ ల లో భారీగా పెట్టుబడులు వస్తాయన్నారు. ఇప్పటికే తెలంగాణలోని సిరిసిల్లలో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడం తో సుమారు 10 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించే మేరకు పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు.

పైన పేర్కొన్న ఈ సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తన పిఎల్ఐ పథకంలో మార్పులు చేయడం లేదా తమ సూచనలకు అనుగుణంగా మరో సమాంతర పథకాన్ని ప్రకటించడం ద్వారా టెక్స్టైల్ ఇండస్ట్రీ లోకి మరిన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed