కేటీఆర్ హామీలు తుస్.. చేనేత చేయూతకు మొండి చెయ్యి

by Shyam |
KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటాం. వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ‘చేనేత చేయూత’ పథకాన్ని పున:ప్రారంభిస్తాం. జీవోలను వెంటనే విడుదల చేస్తాం. కార్మికులు పథంలో పొదుపు చేసుకోవాలి. వేతన వాటా 8 శాతానికి మరో 8 శాతాన్నిపెంచి 16 శాతం ఇస్తాం. కార్మికులంతా పథకంలో చేరాలి.
– 2020 ఆగస్టు7న చేనేత దినోత్సవం రోజు, ఈ నెల 14న ప్రగతి భవన్ లో జరిగిన టెక్స్ టైల్ శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రకటన.

స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటనలు చేసినా… అవి కార్యరూపం దాల్చడం లేదు. చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘చేనేత చేయూత’ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విధితమే. అయితే ఈ పథకం గడువు 2020 ఆగస్టు20 తేదీతో ముగిసింది. తిరిగి పథకాన్ని పున: ప్రారంభిస్తామని 2020 ఆగస్టు 7న నిర్వహించిన చేనేత దినోత్సవంలో మంత్రి పాల్గొని ప్రకటించారు. అయితే 10 నెలలు గడిచినా జీవోలు విడుదల కాలేదు. కార్యరూపం దాల్చలేదు. తిరిగి ఈ నెల 14న ప్రగతి భవన్‌లో జరిగిన టెక్స్ టైల్ శాఖ సమీక్షా సమావేశంలో మరోసారి పున:ప్రారంభంపై ప్రకటన చేశారు. ఇప్పటికైనా జీవోలు విడుదల అవుతాయోలేదోనని చేనేత కార్మికులు మీమాంసలో ఉన్నారు.

రాష్ట్రంలో చేనేత, పవర్ లూమ్స్ లో పనిచేసే కార్మికులు సుమారు లక్షా30వేల మంది ఉన్నారు. ప్రభుత్వం మాత్రం రాష్ట వ్యాప్తంగా 17,632 చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేసింది. పవర్ లూమ్స్ 2లక్షల వరకు ఉంటాయి. కానీ వాటికి జియోట్యాగింగ్ చేయలేదు. నేతన్న ఆర్థిక ఇబ్బందులతో చేసుకుంటున్న ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం ‘చేనేతచేయూత’ పథకాన్ని 2017 జూన్ 24న ప్రారంభించింది. ఇది కేవలం మూడేళ్ల వ్యవధి. అవగాహన ఉన్న కార్మికులు వేతన వాటాను చేనేత చేయూత పథకంలో జమ చేసుకున్నారు. కొంత మంది 6 నెలలు, ఏడాది ఇలా పొదుపు చేసుకున్నారు.

ఈ పథకంలో చేనేతకు అనుబంధంగా రంగులు అద్దకం, అచ్చులు వేసేవారికి అవకాశం కల్పించలేదు. కార్మికులు 8శాతం వాటాను జమచేస్తే ప్రభుత్వం మరో 8 శాతం జమచేసేది. కానీ మూడేళ్ల వ్యవధి ముగిసిన తర్వాతే మూలధనం వచ్చేది. అవసరాలకు మధ్యలో తీసుకునే వెసులుబాటు కల్పించలేదు. దీంతో చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. పథకం పున: ప్రారంభంతో వెసులుబాటు కల్పిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

ప్రభుత్వం వాటా16 శాతానికి పెంపు

చేనేత రంగ కార్మికుడు వేతన వాటాను 8 శాతం జమచేస్తే8 శాతం ప్రభుత్వం ఇచ్చేది. దానిని ప్రభుత్వం 16శాతానికి పెంచింది. దీనితోడు చేనేతకు అనుబంధంగా పనిచేసే చేనేత కార్మికుడితోపాటు డెయ్యర్స్, డిజైనర్స్, వీవర్లు, వైండర్లు , మరియు ఇతర చేనేత పనివారు కూడా ఈ పథకంలో చేరే వెసులుబాటు కల్పించింది. కానీ పవర్ లూమ్స్ కార్మికులకు మాత్రం వేతన వాటా 8 శాతానికి ప్రభుత్వం 8 శాతం జమచేయనుంది. దీంతో రాష్ట్రంలో 34వేల మందికి రూ.109 కోట్ల ప్రయోజనం చేకూరనుందని అధికారుల అంచనా. అంతేకాకుండా కార్మికుల వేతన వాటాను లాకిన్ పిరియడ్ కన్నా ముందే వెసులుబాటు కల్పించారు. దీంతో ఎప్పుడైనా కార్మికులు డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

విడుదల కానీ జీవోలు

ప్రభుత్వం చేనేత చేయూత పథకాన్ని పున: ప్రారంభిస్తున్నామని చెప్పనప్పటికీ జీవో విడుదల చేయలేదు. 2020 ఆగస్టులోనే పథకం ముగిసిన వెంటనే తిరిగి ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటన చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. నిధుల విడుదల చేశామని చెబుతున్నప్పటికీ జీవోలు విడుదల కాకపోతే వాటిని ఎలా వినియోగిస్తారో అధికారులకే తెలియాలి. పవర్ లూమ్స్ కార్మికులకు మాత్రం ప్రభుత్వం జీవో 71ని జారీ చేసింది. కానీ చేనేత కార్మికులను విస్మరించింది. దీంతో పథక లక్ష్యం నీరుగారిపోతోంది. కార్మికులకు అందని ద్రాక్షలాగే మిగిలిపోనుంది. ఇప్పటికైన మంత్రి స్పందించి జీవోలను విడుదల చేయాలని నేతన్నలు కోరుతున్నారు.

మూడేళ్ల గడువెందుకు?

ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం పెట్టినా ఏళ్ల తరబడి కొనసాగేలా జీవోలను జారీ చేస్తుంది. కానీ చేనేత సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ‘చేనేత చేయూత’ పథకానికి మాత్రం మూడేళ్లే గడువు విధించింది. ఈ గడువు ముగిస్తే తిరిగి పథకాన్ని కొనసాగిస్తారా? లేదా? అనేది సందిగ్ధం నెలకొంటుంది. అంటే ప్రభుత్వానికి చేనేత కార్మికులపై చిత్తశుద్ధి లేకనే అని చేనేత సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఇది కేవలం ప్రభుత్వ ఎన్నికల స్టంట్ గానే భావిస్తున్నారు. పథకాన్ని దీర్ఘకాలం కొనసాగించేలా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నేతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మూడేళ్ల కాలపరిమితి కాకుండా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

జీవోలు విడుదల చేయాలి

ప్రభుత్వం నేతన్నల కోసం ప్రవేశపెట్టిన చేయూత పథకానికి మూడేళ్ల పరిమితి తొలగించి నిరంతరం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కార్మికుల వేత వాటా లేకున్నా ప్రభుత్వమే 16 శాతం పథకంలో జమచేయాలి. లాకిన్ పిరియడ్ కాకుండా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించాలి. ప్రభుత్వం పథకం కొనసాగింపునకు నిధులు విడుదల చేశామని చెబుతున్నా జీవోలు విడుదల చేయలేదు. వెంటనే జీవోలు విడుదల చేయాలి.
-కురుపాటి రమేష్, తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు

Advertisement

Next Story