బరాబర్ బుద్ధి చెబుతాం.. ప్రతిపక్షాలను తిప్పికొడతాం: కేటీఆర్

by Anukaran |   ( Updated:2021-09-07 04:48:35.0  )
ktr twitter
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఏడు సంవత్సరాలుగా ఓపిక పట్టాం.. ఇక సహనం నశించింది’.. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు కార్యకర్తలు సన్నద్ధం కావాలి.. వారికి బరాబర్ గుణపాఠం చెబుతామని మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం జలవిహా‌ర్‌లో హైదరాబాద్ విస్తృత స్థాయి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా ప్రతిపక్షాలు ఒక మాట అంటే పది మాటలు అనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నామని ఊరుకుంటే.. మాటలు మితిమీరుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే.. ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదని.. వారికి కడుపు మంటగా ఉందని విమర్శించారు.

ఎన్నిక ఏదైనా మాదే విజయం..

ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు నీరాజనాలు పడుతున్నారని కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఎగిరిపడుతున్న నాయకుల చరిత్ర ప్రజలకు తెలుసని.. నోటిదురుసు తీర్చుకోవడానికే ప్రభుత్వం పై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల మాటలు సర్కస్ చేసేలా ఉన్నాయని.. అవి చూసి ప్రజలు కూడా నవ్వుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్‌కు హుజురాబాద్ చిన్న ఎన్నిక అంటూ కేటీఆర్ ఈ సమావేశంలో అభివర్ణించడం విశేషం.

సన్నద్ధం కావాలి.. లక్షల్లో రావాలి..

గ్రేటర్ పరిధిలో 4,800 కాలనీ అసోసియేషన్‌లు, 1486 బస్తీలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. వీటి కోసం ప్రత్యేకంగా కమిటీలను ఈ నెల 20 లోగా పూర్తి చేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు. మొత్తం కమిటీలను కలుపుకుంటే లక్షల మంది టీఆర్ఎస్ సైన్యం తయారవుతారని.. ఒక్క పిలుపునిస్తే వారంతా తరలివచ్చేలా తీర్చిదిద్దాలని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియా కమిటీని పటిష్టం చేయాలని నేతలకు నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, గ్రేటర్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed