‘అప్పుడు టీఆర్ఎస్‌కు.. మ‌నీ.. మ‌జిల్.. మీడియా ప‌వ‌ర్ లేదు’

by Shyam |
Minister KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో ఎన్నికలు వస్తే దేశ సరిహద్దు పాకిస్తాన్‌తో గొడవలని, రాష్ర్టంలో ఎన్నికలు వస్తే భైంసా లాంటి అల్లర్లను సృష్టించి లబ్ధిపొందాలని చూసేది బీజేపీ అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం బేగంపేట్ హ‌రిత ప్లాజాలో ‘తెలంగాణ జీవితం-సామ‌ర‌స్య విలువ‌ల‌పై తెలంగాణ వికాస స‌మితి’ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ఏ ప్రభుత్వమైనా అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని, ఉన్న జనాభాలో ఒకటి శాతం మాత్రమే ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు. టీఎస్ ఐపాస్‌తో 15వేల పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని, 14వేల పరిశ్రమలు స్థాపించబడి 15లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని వివరించారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడక ముందుకు పరిశ్రమలకు వారానికి మూడు రోజులు పవర్ కట్ ఉండేదని, ఇప్పడు నిరంతరం ఇస్తున్నామని, విద్యుత్ సరఫరాలో దేశంలోనే తెలంగాణ ప్రథమస్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన‌ప్పడు టీఆర్ఎస్ పార్టీకి మ‌నీ.. మ‌జిల్.. మీడియా ప‌వ‌ర్ లేదని, ఈ మూడు ప్రబ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తుల‌ను ఎదుర్కొని కేసీఆర్ ప్రత్యేక రాష్ర్టం సాధించార‌ని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిప‌క్షాల‌కు ఉపాధ్యాయుల మీద ప్రేమ పొంగిపొర్లుతోంద‌ని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రభుత్వ ఉద్యోగుల‌కు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘ‌న‌త ఉంటే చెప్పాల‌ని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీలో ప‌ని చేసే విద్యార్థులు రాష్ర్ట యూనివ‌ర్సిటీల‌లో చ‌దువుత‌లేరని, వారంతా వాట్సాప్ యూనివ‌ర్సిటీల‌లో చ‌దువుతున్నార‌ని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ముందు చూపుతోనే ఆ కార్మికులకు మద్దతు

ఐడీబీఎల్ సంస్థకు గత పాలకులు చేయూత నివ్వకపోవడం వల్లే మూతపడిందని, అయితే ఆసంస్థ భూమిని అమ్మేస్తున్నామని కేంద్రం రాష్ట్రానికి లేక రాసిందని, మన భూమిని మనం కొనాలా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఐఎస్‌డీ సంస్థను సైతం మూసి వేసి 80 వేల మంది ఉద్యోగులను రోడ్డున పడేసిందని, ఇప్పడు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నదని ఆరోపించారు. మునుముందు రాష్ర్టంలో ఉన్న ఈసీఎల్, బీహెచ్ఈఎల్, రైల్వే, పోస్టాఫీసులాంటి కేంద్ర సంస్థలను మూసివేసే అవకాశం ఉందని, అందుకే ముందుచూపుతోనే విశాఖ కార్మికులకు మద్దతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు వయస్సు, హోదాను మరిచి సీఎం కేసీఆర్‌పై మాట్లాడటం తప్ప కేంద్రంపై తెలంగాణకు రావల్సిన హక్కులపై మాట్లాడటం లేదన్నారు. పట్టభద్రులంతా అభివృద్ధిని టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వికాస స‌మితి అధ్యక్షుడు దేశ‌ప‌తి శ్రీనివాస్‌, రాష్ర్ట గ్రంథాల‌య సంస్థ చైర్మన్ శ్రీధ‌ర్‌, సినీ డైరెక్టర్ ఎన్. శంకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, నర్సింహారెడ్డి, రవీందర్, దేవీ ప్రసాద్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, వెంకటేశ్వర్లు, జయంతి, భిక్షపతినాయక్, దామోదర్ రెడ్డి, గోణుగోపాల స్వామి, అరుణ్ కుమార్, శివకుమార్ తో పాటు అన్ని జిల్లాల్లోని వికాస సమితి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed