లాక్‌డౌన్ స‌మ‌యంలో కార్మికులు ఇబ్బంది పడొద్దు

by Shyam |   ( Updated:2020-04-20 06:08:39.0  )
లాక్‌డౌన్ స‌మ‌యంలో కార్మికులు ఇబ్బంది పడొద్దు
X

– అధికారులతో వీడీయో కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ సమయంలో కార్మికులు ఎవరూ ఇబ్బంది పడొద్దనీ, అందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం, కంపెనీలు తీసుకోవాల్సిన అవసరముందని రాష్ట్ర పుర‌పాల‌క, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు తెలిపారు. సోమ‌వారం జిహెచ్‌ఎంసి క‌మాండ్ కంట్రోల్ రూం నుంచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డితో క‌లిసి అన్ని జిల్లాల కార్మిక‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖల అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

లాక్‌డౌన్‌తో నెల‌రోజుల నుంచి దాదాపు అన్ని ర‌కాల ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయ‌ని చెప్పారు. ఈ సమయంలో కార్మికుల‌కు వేతనాలు చెల్లించాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టంగా ఆదేశిస్తూ ఉత్త‌ర్వులు జారీచేసిన‌ట్లు తెలిపారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు కూడా విద్యుత్ బిల్లులు, ఆస్తిప‌న్ను చెల్లింపులో ప్ర‌భుత్వం అనేక వెసులుబాట్లు క‌ల్పించిన‌ట్లు తెలిపారు. వ‌ల‌స కార్మికుల‌కు కూడా 12 కిలోల బియ్యాన్ని, రూ.500 న‌గ‌దును ప్ర‌భుత్వం ఇస్తోంద‌ని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో వ‌ల‌స కార్మికులు కూడా భాగ‌స్వాములేన‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ట్లు గుర్తు చేశారు. ఫ్యాక్ట‌రీల వ‌ద్ద ఉండిపోయిన కార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు అందించాల్సిన బాధ్య‌త తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. రేష‌న్‌ కార్డు లేని వారికి కూడా బియ్యం, న‌గ‌దును మంజూరుచేసే అధికారాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు క‌ల్పించిన‌ట్లు తెలిపారు. ప‌ని ప్ర‌దేశాల్లో ఉన్న కార్మికుల‌కు వైద్య సేవ‌ల‌ను అందించాల‌ని ఆదేశించారు.

వ‌ల‌స కార్మికులు రోడ్ల‌పైకి రావ‌డం వ‌ల‌న ఇంత వ‌ర‌కు అమ‌లు చేసిన లాక్‌డౌన్ ల‌క్ష్యం దెబ్బ‌తింటుంద‌ని తెలిపారు. ఎక్క‌డ ఉన్న కార్మికుల‌ను అదే ప్ర‌దేశంలో ఉంచాల‌ని ఆదేశించారు. ఈ అంశంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. ప‌ని ప్ర‌దేశాల్లో ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రులు, ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల‌తో పాటు అందుబాటులో ఉన్న ప్రైవేట్ వైద్యుల సేవ‌ల‌ను కూడా తీసుకోవాల‌ని తెలిపారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో స‌హాయ‌ప‌డేందుకు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబ‌ర్ల‌ను కార్మికుల‌కు అంద‌జేయాల‌ని సూచించారు. ప‌ని ప్ర‌దేశంలో కార్మికుల‌కు మాస్కులు, శానిటైజ‌ర్లు ఇవ్వాల్సిన బాధ్యత యాజ‌మ‌న్యాల‌దేన‌ని స్ప‌ష్టం చేశారు. అవ‌స‌ర‌మైన‌ చోట గ్లౌసులు కూడా ఇవ్వాల‌ని తెలిపారు. స‌ద‌రు ప‌రిశ్ర‌మ‌లు 30-40 శాతం సామ‌ర్థ్యం మేర‌కే న‌డ‌వాల‌ని తెలిపారు. కార్మికుల సంక్షేమానికి, సామాజిక దూరం నిబంధ‌న‌ల అమ‌లుకు రెగ్యుల‌ర్‌గా ఆయా ప‌రిశ్ర‌మ‌ల‌ను త‌నిఖీ చేయాల‌ని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేష్‌రంజ‌న్‌, క‌మిష‌న‌ర్ మాణిక్‌రాజ్‌, కార్మిక శాఖ క‌మిష‌న‌ర్ న‌ధీమ్ అహ్మ‌ద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:Municipal Staff, safety, covid 19, Minister KCR, Video Conference, Masks

Advertisement

Next Story