‘కరోనాకు ఎవరు అతీతులు కాదు’

by Anukaran |
‘కరోనాకు ఎవరు అతీతులు కాదు’
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌పై ప్రతిపక్షాలు అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇటువంటి కష్టకాలంలో అనవసర ఆరోపణలు చేస్తే రాజకీయంగా కూడా ఏ లాభం జరగదని వారికి సూచించారు. రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో 98 శాతం మంది కోలుకుంటున్నారని.. కేవలం 2 శాతం మరణాలు నమోదు అవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం ఈటల రాజేందర్‌తో కలిసి కేటీఆర్ మెడికల్ కాలేజీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ వైద్య కళాశాల లేనంత అందంగా మహబూబ్‌నగర్ మెడికల్‌ కాలేజీని తీర్చిదిద్దారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, బీబీనగర్ ఈ ఐదు చోట్ల కొత్త ఆస్పత్రులను నిర్మించుకున్నామన్నారు. అంతేకాకుండా, కేసీఆర్ కిట్ రూపంలో మాతాశిశు మరణాలను తగ్గించుకున్నామన్నారు. ఇదే సమయంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ వివరించారు.

తెలంగాణలో కరోనా వైరస్‌పై స్పందించిన కేటీఆర్.. కొవిడ్ 19 పేషంట్లకు ప్రభుత్వ రంగ వైద్యులే అండగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు. ప్రైయివేటు ఆస్పత్రుల్లోనే వెనక్కి పంపుతున్నారని చెప్పారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ శక్తి వంచన లేకుండా ఈ మహమ్మారిపై పోరాటం చేస్తున్నారని కొనియాడారు. కొవిడ్ 19 పేషంట్లకు ప్రభుత్వ రంగ వైద్యులు అండగా నిలుస్తున్నారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. మానవాళి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య కరోనా అని ఆయన అభివర్ణించారు. తెలంగాణ వైద్యాధికారులు ప్రాణాలకు తెగించి కృషి చేస్తున్నారని చెప్పారు. అటువంటి వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ప్రతిపక్షాలు మాట్లాడటం సరికాదన్నారు.

నాలుగు కోట్ల మందికి ఒకే గాంధీ హాస్పిటల్ అన్న వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రతి జిల్లాలో కొవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా మొత్తం మానవాళిపై కోలుకోని దెబ్బతీసిందని.. ఇది రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సమస్య కాదన్నారు. ధనిక దేశాలనే వైరస్ దిక్కు లేకుండా చేసిందన్నారు. కరోనాకు ఎవరూ అతీతులు కాదని ఆయన గుర్తు చేశారు. అలాగే, కరోనా వైరస్‌ను జయించిన ప్రభుత్వం ఏదీ లేదని కేటీఆర్ తెలిపారు. దీనిపై నెగెటివ్ వార్తలు తక్కువ రాస్తే మంచిదని చెప్పారు. కావాలని అనవసర వ్యాఖ్యలు చేసి ప్రతి పక్షాలు పైశాచిక ఆనందం పొందుతున్నాయని విమర్శించారు. అందరూ సమిష్టిగా ఉండి వైరస్‌ను ఎదుర్కొందామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

Next Story