హుజురాబాద్ ఓటమిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు

by Shyam |
హుజురాబాద్ ఓటమిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుంటాం… సమీక్షించుకుంటాం… ప్రజల తీర్పుకు కట్టుబడి ఉన్నాం… తప్పులను సరిదిద్దుకుంటాం.. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదు… అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది… మరిన్ని పథకాలు తేవడానికి కృషి చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓటమికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధం లేదు అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కు ఉపఎన్నికలు కొత్తకాదు.. ఎన్నో ఒడిదొడుకులు.. ఇబ్బందులను చవిచూసిందన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు తో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్ లో గెలిచిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. దళిత బంధు వెంటనే అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేయడం హాస్యాస్పదం అన్నారు. ఆయన ఏ అర్హతతో మాట్లాడుతున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత బంధు దేశానికే ఆదర్శవంతమైన పథకం అని, ఎక్కడ ఆగలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆలోచనతో తెలంగాణలో మొదలైన పథకం అని తెలిపారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఫిర్యాదుతోనే ఆగిందని, బీజేపీ చెబితేనో… బండి సంజయ్ చెబితేనో మొదలు పెట్టిన పథకం దళిత బంధు కాదు అన్నారు.

బీజేపీ నేతలు అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. దళితులను మోసం చేస్తున్న పార్టీ బీజేపీ అని, హుజురాబాద్ లో ఏక్కడ లేని విధంగా బీజేపీ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. ఆ మేనిఫెస్టో ను అమలు చేసేందుకు బండి సంజయ్ కేంద్రంతో కొట్లాడాలని సూచించారు. బీజేపీ ఉన్నత వర్గాల కోసం, ఆదానీ, అంబానీల కోసం పనిచేస్తోందని.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని మండిపడ్డారు. బీజేపీకి యువతపై ప్రేమ ఉంటే ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎవరికి కొమ్ముకాస్తోందో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారన్నారు. సరైన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.

Advertisement

Next Story

Most Viewed