‘వ్యవసాయ విజ్ఞానం పెంచడానికే.. వాటి నిర్మాణం’

by Shyam |
‘వ్యవసాయ విజ్ఞానం పెంచడానికే.. వాటి నిర్మాణం’
X

దిశ, నల్లగొండ: తెలంగాణలో నిర్మించతలపెట్టిన రైతు వేదికల నిర్మాణాలు దేశానికే తలమానికంగా నిలవనున్నాయని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పలు రైతు వేదికల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని అన్నారు. వ్యవసాయ విజ్ఞానం పెంపొందించేందుకే రైతు వేదికలు నిర్మిస్తున్నామని తెలిపారు. క్లస్టర్ పరిధిలోని రైతాంగాన్ని ఒకే వేదిక మీదకు చేర్చేందుకు తద్వారా రైతాంగాన్ని సంఘటితం చేయాలన్నదే కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. గిట్టుబాటుధర నిర్ణయించేందుకు రైతు వేదికలు తొలి అడుగని, ఏయే పంటలు ఏయే భూములు అనువైన భూములో రైతులకు అవగాహన పెంపొందించేందుకు ఉపయోగపడతాయని వివరించారు. భూసారం, పోషకాల అవసరం వంటి అంశాలను రైతు వేదికల ద్వారా చర్చించేందుకు దోహదపడతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనికతకు రైతు వేదికలు నిదర్శనమని, వ్యవసాయానికి నీళ్లు, పంటల సాగుకు పెట్టుబడి సాయం ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం పండుగలా మారిందని, ఇదే స్ఫూర్తితో యావత్ భారతదేశంలోనూ మార్పులు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, గాదరి కిశోర్ కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రామచంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed