బుడ్డేర్‌ఖాన్ గాళ్లు నోళ్లు అదుపులో పెట్టుకోవాలి : జగదీష్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-10-03 07:19:51.0  )
Jagadish Reddy
X

దిశ, సూర్యాపేట: బుడ్డేర్ ఖాన్ గాళ్లు నోళ్లు అదుపులో పెట్టుకోవాలి. బూతులు తిడితే జనాలు వస్తారా అని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఆదివారం సూర్యాపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బతకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపై నడిపిస్తూ, అడిగినా అడగకున్నా అందరికి సంక్షేమ పథకాలు అందిస్తోన్న ప్రజా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. బట్టల కోసం గొడవలు పడే అక్కలను, అలిగే చెల్లెళ్లను చూశామని, అటువంటి ఆడపడుచులను తోబుట్టువులుగా, ఇంటి ఆడపడుచులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ భావించి ప్రవేశ పెట్టిందే బతకమ్మ చీరల పంపిణీ అని అన్నారు.

ఒకప్పుడు బతకమ్మ ఆడాలంటేనే భయపడే వాళ్లమని, తెలంగాణ యాసలో పలకరించాలంటేనే వణికి పోయే వాళ్లమని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించాక బాజాప్తాగా ప్రపంచంలోనే ఏ జాతికి లేని అద్భుతమైన పద్ధతిలో జరిగే పండుగగా బతకమ్మ నిలిచిందన్నారు. అటు ప్రజలకు, ఇటు చేనేత కార్మికులకు కలిసి వచ్చేలా రూపొందించిందే ఈ చీరల పంపిణీ కార్యక్రమని మంత్రి తెలిపారు. అటువంటి మహానేత పై నోరు పారేసుకోవడానికి విపక్షాలకు నోళ్లు ఎలా వస్తున్నాయని ఆయన విరుచుకుపడ్డారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story