ఈటల రాజేందర్ సవాల్.. హరీష్ రావు రియాక్షన్ ఎంటీ..?

by Anukaran |
etala-harish
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ గురువారం చేసిన సవాల్‎పై మంత్రి హరీష్ రావు ఎలా స్పందిస్తారోనన్న చర్చ మొదలైంది. ఈటల వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే మంత్రి హరీష్ రావు హుజురాబాద్‌‌కు వస్తుండడంతో.. ఆయన కౌంటర్ అటాక్ ఎలా చేస్తారోనన్న ఉత్కంఠ టీఆర్‌ఎస్ వర్గాల్లో నెలకొంది.

హుజురాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాట్లు తానే చేస్తానని.. దమ్ముంటే హరీష్ రావు రావాలని ఈటల సవాల్ విసిరారు. రబ్బరు స్టాంపువి, రెండోసారి మంత్రివర్గంలో అవకాశం నేను మాట్లాడితే వచ్చింది.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటల ప్రెస్ మీట్‎లో చేసిన ఈ కామెంట్లపై ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు కౌంటర్ ఇచ్చారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం హుజురాబాద్‌లో విశ్రాంత ఉద్యోగులతో జరగనున్న సమావేశానికి మంత్రి హరీష్ రావు వస్తున్న నేపథ్యంలో ఆయన ఎలా స్పందిస్తారోనన్న చర్చ ఉత్కంఠను రేపుతోంది.

మిత్రుల మధ్య యుద్ధం మొదలు..

ఉద్యమ ప్రస్థానం నుండి అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ ఈటల, తన్నీరుల మధ్య ప్రస్తుతం డైరక్ట్ వార్ స్టార్ట్ అయింది. రాజీనామా చేసిన తరువాత హుజురాబాద్ ఇన్‌చార్జీగా హరీష్ రావుకు సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. అప్పుడు కూడా ఈటల మాట్లాడుతూ.. నా మిత్రుడికి కూడా ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగించారని తెలిసిందంటూ కామెంట్ చేశారు. ఇంతకాలం తెర వెనక ఉండి కార్యకలాపాలు కొనసాగించిన హరీష్ రావు అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ ప్రకటన అనంతరం నేరుగా తిరుగుతున్నారు.

తాజాగా ఓటర్లతో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ కావడంతో.. స్పందించిన ఈటల రాజేందర్ హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడారు. దీంతో నాటి మిత్రులు నేడు రాజకీయ శత్రువులుగా మారిపోయారని స్పష్టం అయింది. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీష్ రావు హుజురాబాద్ వస్తున్న నేపథ్యంలో ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.

Advertisement

Next Story