FRBM పరిమితిని పెంచండి.. నిర్మలా సీతారామన్‌కు హరీశ్‌రావు విజ్ఞప్తి

by Shyam |
Minister Harish Rao, Union Finance Minister Nirmala Sitharaman
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాల సగటు ఆర్థిక లోటు సుమారు 36.3% ఉన్నప్పటికీ తెలంగాణ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని, 23.10% మేర నమోదైందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిపోయిందని, దీనికి తోడు ఖర్చులు కూడా పెరిగిపోయాయని, లోటును భర్తీ చేసుకోడానికి ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ కౌన్సిల్ 43వ సమావేశానికి శుక్రవారం హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ, ప్రస్తుతం తెలంగాణకు ఎఫ్ఆర్‌బీఎం పరిమితి రాష్ట్ర జీఎస్‌డీపీలో 3% మాత్రమే ఉందని, దీన్ని 5% కి పెంచాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా కారణంగా ప్రజారోగ్యం కోసం వైద్యారోగ్య రంగానికి ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తోందని, పరిమిత ఆదాయ వనరులతో ఈ ఖర్చును భరించడం ఇబ్బందిగా మారిందని, బహిరంగ రుణాల ద్వారా, ద్రవ్య సంస్థల నుంచి అప్పుల ద్వారా సమకూర్చుకోడానికి ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని పెంచడమే మార్గమని అభిప్రాయపడ్డారు.

న్యూట్రల్ ఆల్కహాల్‌ను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలి

న్యూట్రల్ ఆల్కహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవడం సమంజసం కాదని పేర్కొన్న హరీశ్‌రావు అన్ని రాష్ట్రాలు కోరుతున్నట్లుగానే తెలంగాణ కూడా ఈ డిమాండ్‌ను బలపరుస్తోందన్నారు. ప్రస్తుతం జీఎస్టీ పరిధిలోకి రాకుండా రాష్ట్రాలకు వదిలేసినవి ఎక్సైజ్, పెట్రోలు, డీజిల్ మాత్రమేనని, న్యూట్రల్ ఆల్కహాల్ విషయాన్ని కేంద్రం తన పరిధిలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి గణనీయమైన స్థాయిలో సెస్, సర్‌ఛార్జీల రూపంలో ఆదాయం సమకూరుతోందని, కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం చూస్తే, గత బడ్జెట్‌లో రెవెన్యూలో 18శాతం సర్‌చార్జి, సెస్‌ల రూపంలో సమకూరిందని గుర్తుచేశారు.

మొత్తం రూ. 22.17 లక్షల కోట్ల బడ్జెట్‌లో సుమారు రూ. 3.99 లక్షల కోట్లు ఈ రూపంలోనే సమకూరిందన్నారు. ఇందులో సుమారు రూ. 1.64 లక్షల కోట్లను రాష్ట్రాలు కోల్పోతున్నాయన్నారు. ఈ రూపంలో కేంద్రానికి సమకూరే మొత్తం ఆదాయంలో దాదాపు 41 శాతాన్ని కేంద్రమే వసూలు చేసుకుంటున్నదన్నారు. ఆ మేరకు రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్నే చూసుకుంటే మొత్తం ఆదాయంలో 2.1% మేర రూ. 3,439 కోట్లను కోల్పోతున్నదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యూట్రల్ ఆల్కహాల్‌ను కూడా కేంద్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకెళ్తే రాష్ట్రాలకు మరింత ఆదాయం తగ్గిపోతుందన్నారు. జీఎస్టీ పరిధి నుండి శాశ్వతంగా న్యూట్రల్ ఆల్కహాల్‌ను మినహాయించేలా నిర్ణయం తీసుకోవాలన్నారు.

కన్సాలిడేటెడ్ ఫండ్ నిధులను విడుదల చేయాలి

దేశంలో అతి‌ తక్కు‌వ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఐజీఎస్టీ నిధులు గత ఏడాది రూ. 2,638 కోట్లు వచ్చాయని, ఈ ఏడాది ఐజీఎస్టీ నిధులు రూ. 13,000 కోట్లు కన్సాలిటేడెటి ఫండ్‌కు ఆదాయం సమకూరిందన్నారు. ఇందులో రాష్ట్రానికి నిష్పత్తి ప్రకారం రావాల్సిన రూ. 218 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. ఆర్థిక స్థితిగతులు బాగాలేని ప్రస్తుత పరిస్థితిల్లో, పరిహారం ఇచ్చేందుకు ఇదే చివరి సవంత్సరం అయినందు వల్ల, రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలని కోరుతున్నా. అని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed