అది రాష్ట్ర పురోగతికి అడ్డంకిగా మారింది: మంత్రులు

by Sridhar Babu |   ( Updated:2021-12-28 06:16:25.0  )
Minister-Gangula
X

దిశ, కరీంనగర్ సిటీ: ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తెలంగాణకు గొడ్డలిపెట్టుగా మారిందని, వ్యవసాయ అనుబంధ రంగాల ఏర్పాటుకు సహకార సంఘాలతోపాటు నాబార్డ్ సహకరించాలని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలక వర్గం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో నిర్వహించిన శత వసంతాల వేడుకలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర పురోగతికి అడ్డంకిగా మారిందని, దీనిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు ఉద్యోగ కల్పన కష్టసాధ్యమైన తరుణంలో సహకార సంఘాలు చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చేసి, స్వయం ఉపాధి కల్పించాలన్నారు. వ్యక్తిగత పూచీకత్తుపై ఋణాలందించేలా చర్యలు తీసుకోవాలని, గ్రామీణ స్థాయిలో సహకార అభివృద్ధి కోసం పాటు పడాలన్నారు.

దేశంలో సహకార రంగం దివాళా దిశలో ఉంటే జిల్లాలో మాత్రం ఇంతితై అన్నట్లుగా ఎదుగుతుండటం, బ్యాంకు చైర్మన్ రవీందర్ రావు కృషికి నిదర్శనమన్నారు. అలవా నాబార్డ్ చైర్మన్ చింతల గోవింద రాజు మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనంతరం, తెలంగాణ రాష్ట్రం ఉభయ గోదావరి జిల్లాలను తలపిస్తోందని కీర్తించారు. సహకార రంగ పటిష్టత కోసం సంఘానికి పునాదిరాళ్లైన రోజువారి గణాంకాలు స్పష్టంగా ఉండాలన్నారు. అకౌంట్ల నిర్వహణలో కేడీసీసీబీ పారదర్శకతను పాటిస్తుండటంతో, ఉత్తమంగా పనిచేస్తున్న దేశంలోని 30 సహకార బ్యాంకుల్లో మొదటి స్థానం సంపాదించిందన్నారు. కంప్యూటరీకరణ అనంతరం సహకార బ్యాంకుల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, అధునాతన విధానాలు అవలంబించడం సహకార సంఘాల ఇంటికి ఎంతగానో తోడ్పాటునందిస్తుందన్నారు. ఈ సమావేశంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, క్రిబ్కో చైర్మన్ చంద్ర పాల్ సింగ్ యాదవ్, ఇప్కో చైర్మన్ దిలీప్ సంఘానియా, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సంజయ్ కుమార్, కలెక్టర్ ఆర్ వి కర్ణన్, జెడ్పీ చైర్ పర్సన్ కనమల్ల విజయ, జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed