బీజేపీ నేతలవి ఝూటా మాటలు: మంత్రి గంగుల

by Sridhar Babu |
Minister-Gangula-132
X

దిశ, కరీంనగర్ సిటీ: వరి ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ చేస్తున్న ధర్నాలు అర్థరహితమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆ పార్టీ నాయకుల తీరు దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యాసంగి వరిసాగులో బాయిల్డ్ రైస్ కొనమని స్పష్టంగా ప్రకటించినప్పటికీ, బీజేపీ నాయకులు ఆందోళనకు దిగటం సిగ్గుచేటన్నారు. రైతులను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ నాయకులు ఆందోళనలు చేపడుతున్నారని మండిపడ్డారు. ఆందోళనలు కాదు.. ముందు యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలన్నారు. కేంద్రం చేస్తున్న అస్పష్ట వ్యాఖ్యలతో ఖరీఫ్ సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారని, వానాకాలం పంట ఎక్కడ కొనుగోలు చేయకున్నా బాధ్యత తనదేనంటూ హామీ ఇచ్చారు.

గతంలో 6 వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈ సారి 6,663 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,500 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతున్నట్లు, ఇప్పటికే రూ. రూ. 1000 కోట్ల విలువ చేసే, 5 లక్షల 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి లు ఇక్కడ కాదు.. ఢిల్లీలో యాసంగి పై ధర్నా చేసి కేంద్రాన్ని ఒప్పించాలని హితువు పలికారు. టీఆర్ఎస్ ధర్నా చేయబోతుందని కౌంటర్ గా బీజేపీ ధర్నా చేపట్టిందన్నారు. బియ్యం కొనకుంటే బీజేపీ నేతల ఇళ్ల ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ప్రకారమే కొనుగోలు జరుగుతున్నాయి. కొనుగోళ్లలో జాప్యం రాష్ట్రానిది బాధ్యత కాదని, జిల్లాలో 355 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 345 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణ జరుగుతుందని, బీజేపీ ఝూటా మాటలు చెబుతూ, రైతులను మోసం చేస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తే నిజాలు తెలుస్తాయని, కార్యాచరణ తెలియకుండా ఆందోళనలు చేపట్టడం హాస్యాస్పదమన్నారు.

Advertisement

Next Story

Most Viewed