భయంతోనే చాలా మంది చనిపోతున్నారు

by Shyam |
భయంతోనే చాలా మంది చనిపోతున్నారు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత చాలా మందిలో భయం పెరుగుతోందని, ఆ కారణంగా చనిపోతున్నారని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితి నుంచి ప్రజలను బైటపడేసి మరింత అవగాహన కల్పించి వారిలో ధైర్యాన్ని నెలకొల్పడమే మన ముందున్న తక్షణ కర్తవ్యమని డాక్టర్లకు సూచించారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో గురువారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశం సందర్భంగా మంత్రి పలు విషయాలను వారితో పంచుకున్నారు. కరోనా వైరస్ గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయని, వారితో సంప్రదింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదనే అంశాన్ని వైద్య నిపుణులు చెప్తున్నారని, పాజిటివ్ నిర్ధారణ అయినవారిలో దాదాపు 90 శాతం మందికి ఎలాంటి ఆక్సిజన్ సౌకర్యం, వెంటిలేటర్ లాంటివి అవసరమే లేదని, రెమ్‌డెసివిర్ అనే మందు కూడా అవసరం లేదని అన్నారు. కేవలం యాంటీ ఇన్‌ప్లమేటరీ మందులు సరిపోతాయని, సకాలంలో వాటిని వాడడం వల్ల ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని సూచించినట్లు తెలిపారు. వైరస్ ఉన్నట్లుగా ఎంత తొందరగా గుర్తించగలిగితే అంత వేగంగా వారిని ప్రాణాపాయం నుంచి కాపాడగలుగుతామన్నారు.

జిల్లాల్లోని ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లను భయానికి గురికాకుండా వెంటనే అడ్మిట్ చేసుకోవాల్సిందిగా సూపరింటెండెంట్లకు మంత్రి స్పష్టం చేశారు. ప్రతీ సిబ్బంది పూర్తి సామర్ధ్యంతో పనిచేయాలని, అవసరమైతే అదనపు సిబ్బదిని వెంటనే నియమించుకోవాలని, ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడు ఏ రకంగా సాయం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని వారికి హామీ ఇచ్చారు. కానీ వైద్య చికిత్స విషయంలో మాత్రం నిర్లక్ష్యం వద్దని, వీలైనంతగా కరోనా మరణాలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఆసుపత్రులకు వివిధ రూపాల్లో ఉన్న బకాయలన్నింటినీ చెల్లిస్తామని, డైట్ కాంట్రాక్టర్ల బకాయిలను కూడ వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కరోనా చికిత్సలో ఉన్న పేషెంట్లకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలన్నారు.

వైద్య సిబ్బందికి ‘నిమ్స్‌’లో చికిత్స

అన్ని జిల్లాల్లో ఐసొలేషన్ కేంద్రాలను నెలకొల్పాలని ఆదేశించిన మంత్రి వైద్య సిబ్బంది మొదలు పారిశుద్య కార్మికుల వరకు తగినంత సంఖ్యలో నియామకాలు చేసుకోవచ్చని, వారికి వైరస్ ఇన్‌ఫెక్షన్ సోకినట్లయితే నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చని స్పష్టం చేశారు. అన్ని ఆసుపత్రులకూ అవసరమైన మేరకు ఆక్సిజన్ సిలిండర్లను ఇక్కడి నుంచే పంపిస్తామని తెలిపారు. ఆసుపత్రుల్లోని డాక్టర్లు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున ఏజన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. హోమ్ ఐషోలేషన్‌లో ఉన్నవారిని పక్క ఇళ్ళవారు ఇబ్బంది పెట్టకుండా చూడాలని కోరారు.

Advertisement

Next Story