జాగ్రత్త.. బయటకెళ్లొద్దు : మంత్రి ఎర్రబెల్లి

by Shyam |
జాగ్రత్త.. బయటకెళ్లొద్దు : మంత్రి ఎర్రబెల్లి
X

దిశ ప్రతినిధి, వరంగల్: వ‌రుస‌గా కురుస్తున్న వాన‌ల‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, పూర్తిగా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌ను రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదేశించారు. ఆదివారం మంత్రి వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరిలోని త‌న క్యాంపు కార్యాల‌యం నుంచి పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, ముఖ్య నేత‌ల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ వ‌రుస‌గా కురుస్తున్న వాన‌ల‌తో చెరువులు కుంట‌లు అలుగు పడుతూ, వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయ‌న్నారు. ఈ మేరకు ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు రాకుండా చూడాల‌న్నారు. అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు ఎప్ప‌టికప్పుడు చెరువులు, కుంట‌ల ప‌రిస్థితుల‌ను తెలుసుకుంటూ వాటిని సంద‌ర్శించాల‌న్నారు.

అలాగే ఎక్కడైనా లోత‌ట్టు ప్రాంతాలుంటే, ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించి, వారికి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేసి, ఆహారం అందించాల‌ని ఆదేశించారు. ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వెళ్లొద్ద‌న్నారు. శిథిలావ‌స్థ‌లో ఉన్న పాత భ‌వ‌నాలు ఖాళీ చేయాల‌న్నారు. రైతులు, కూలీలు, చేప‌లు ప‌ట్టేవారు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, బ‌య‌ట‌కు వెళ్ళొద్ద‌ని మంత్రి సూచించారు.

Advertisement

Next Story