గుండు పోతే గుండు.. ‘బండి’ స్కీమ్‌పై ఎర్రబెల్లి సెటైర్లు

by Anukaran |
గుండు పోతే గుండు.. ‘బండి’ స్కీమ్‌పై ఎర్రబెల్లి సెటైర్లు
X

దిశ‌, కాళోజీ జంక్షన్: వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కారు విజయం గెలుపు ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో ఆయన కీలక నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం డివిజన్లలో గెలిచి తీరాలన్నారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయం కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల కేటీఆర్‌ రూ. 25 వేల కోట్లతో అభివృద్ధి పనులకు చేసిన శంకుస్థాపనలను జనాల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పు దారి పట్టిస్తున్న బీజేపీ.. అసలు రంగును ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

వార్ వన్ సైడ్.. బండి సంజయ్‌పై సెటైర్లు

అనంతరం ఓ ప్రైవేట్ స్కూ‌ల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కార్పొరేషన్ ఎన్నికల్లో వార్ వన్ సైడే అంటూ వ్యాఖ్యానించారు. వరంగ‌ల్ పట్టణంలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగిందన్నారు. ఇంకా మూడు సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి ఎన్నికల్లో కూడా ప్రజలు ఓడిస్తూ వస్తున్నా.. సంజయ్‌కు మాత్రం బుద్ధి రావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందుకు నిదర్శనం ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను చూస్తే అర్థం అవుతోందన్నారు. దీనికి తోడు బండి పోతే బండి.. గుండు పోతే గుండు అని అనవసర హామీలు ఇచ్చారంటూ ఎర్రబెల్లి సెటైర్లు వేశారు.

కేంద్రం మెడలు వంచి.. కోచ్ ఫ్యాక్టరీ తెస్తాం

ఇదే సమావేశంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై మాట్లాడిన ఎర్రబెల్లి.. కేంద్రం మెడలు వంచైనా సాధించి తీరుతామన్నారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే భూముని కేటాయించిన.. ఇవ్వలేదని అబద్ధపు ప్రచారం చేయడం దారుణమన్నారు. గత ఆరున్నర ఏండ్లలో పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూళ్లు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు మొండి చేయి చూపడం ఏంటని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి వినోద్ కుమార్, కడియం శ్రీహరి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story