బాధ్యత మరచిన మంత్రి

by Shyam |
బాధ్యత మరచిన మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించి… ప్రధాని మంత్రి నుంచి సీఎం వరకు నిబంధనలు పాటిస్తుంటే తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ మాత్రం గీత దాటారు. జనాలు గుమిగూడే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఓ వైపు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసి, ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటే అవేవి తనకు పట్టనట్లుగా మంత్రి వ్యవహరించారు. గురువారం మహబూ‌బ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్‌లో ఓ జిమ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. మామూలు సందర్భాల్లో ఆయన ఇలాంటి ప్రారంభోత్సవాలు చేయడం తప్పుకాకపోయినప్పటికీ ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో జిమ్ లాంటివన్నీ మూసేయాలన్న ఉత్తర్వులు అమలవుతుండగా ప్రారంభించడమే గమనార్హం. ఈ జిమ్‌ను ప్రారంభించడం ద్వారా ఆయన ప్రజలకు ఏం సందేశం ఇచ్చారన్నది ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. జిమ్‌లకు వెళ్ళవద్దని, వాటిని మూసేయాలని ప్రభుత్వం చెప్తూ ఉంటే మంత్రి మాత్రం అవేవీ పట్టనట్లు ఎంచక్కా ప్రారంభించి ఫోటోలకు పోజులిచ్చారు. పైగా ఆ సందర్భంలో ఆయన సోషల్ డిస్టెన్స్‌ అనే బాధ్యతను కూడా మరిచారు. లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ లాఠీ పట్టిన ఆయన.. ఇప్పుడు మాత్రం ఆ బాధ్యత మరిచి స్వయంగా జిమ్ ప్రారంభించడంపై ఓ రేంజ్‌లో విమర్శలు వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం కూరగాయల మార్కెట్‌ ప్రారంభించినప్పుడూ సోషల్ డిస్టెన్స్‌‌ ఉల్లంఘించారని విమర్శలు ఎదుర్కొన్న మంత్రి… మళ్లీ ఇప్పుడు ఈ సందర్భంలో వివాదంలో చిక్కుకున్నారు. ఇది శుభ దినం అని సదరు మంత్రిగారు సమర్థించుకోవడం విశేషం.

Tags: minister Srinivas Goud, Lockdown, violation, Mahabubnagar, Zym Opening

Advertisement

Next Story