ఇంకెన్ని రోజులు ఈ ముచ్చట్లు.. సుందరీకరణ అయ్యేనా..?

by Shyam |   ( Updated:2021-03-20 10:35:41.0  )
ఇంకెన్ని రోజులు ఈ ముచ్చట్లు.. సుందరీకరణ అయ్యేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘చార్మినార్, చుట్టు పక్కల ప్రాంతాలను అందంగా మార్చుతామన్న మాటలు నా చిన్నప్పటి నుంచి వింటున్నా’ అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే ఆజాంఖాన్​అసెంబ్లీలో శనివారం వ్యాఖ్యానించారు. సిటీలోని మేజర్ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులే చేయలేదన్నారు. మూసీ రివర్​ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పడి ఐదేండ్లు దాటిందని, పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలపాలన్నారు. ఈ బడ్జెట్‌లో కేవలం రూ.200కోట్లను మాత్రమే ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. గతేడాది వరదలు వచ్చినపుడు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మరో మూడు నెలల్లో వర్షాకాలం రానుండటంతో నగరంలోని నాలాలు, వరద నీటి వ్యవస్థకు సంబంధించి ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు.

చార్మినార్ సుందరీకరణ, చార్మినార్ నుంచి మొజాంజాహీ మార్కెట్​వరకూ ట్రామ్ వేస్తామని మంత్రి కేటీఆర్​ఓ సందర్భంలో చెప్పారని, ఆ పనులు ఎక్కడి వరకూ వచ్చాయని ప్రశ్నించారు. సీఆర్‌ఎంసీ, ఎస్ఆర్‌డీపీ ప్రాజెక్టుల కోసం జీహెచ్‌ఎంసీ రూ.1,300 కోట్ల అప్పులు చేసిందని, అందుకోసం ఏడాదికి రూ.170 కోట్ల వడ్డీ చెల్లిస్తోందని వివరించారు. ఈ బడ్జెట్​లో రూ.2,300 కోట్లకు జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు పంపిస్తే కేటాయింపులు ఇవ్వలేదన్నారు. ఎంఎంటీఎస్​రెండో దశ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించేందుకు ముందుకు రాకపోవడం వల్లే తాము నిధులు ఇవ్వడం లేదని కేంద్రం చెబుతోందన్నారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఎంఎంటీఎస్‌ను కాదని, మెట్రో రెండో దశ కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. మెట్రో రెండో దశలో ఫలక్‌నుమా-ఆర్‌జీఐ కూడా ఉందని అసలు ఫలక్‌నుమా వరకూ మెట్రో పూర్తి చేయకుండా ఈ పనులు ఎలా చేపడుతారని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed