యూపీలో హైదరాబాద్ సత్తా చూపిస్తా.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2021-08-27 08:15:29.0  )
MIM party chief Asaduddin owaisi
X

దిశ, తెలంగాణ ​బ్యూరో: గుజరాత్​ నుంచి వచ్చిన నరేంద్రమోడీ ప్రధాని అయ్యారు.. హైదరాబాద్ నుంచి వచ్చిన నేను యూపీలో సత్తా చాటలేదా? అని ఆల్ ఇండియా మజ్లీస్ ఇత్తేహాదుల్ ముస్లీమిన్ పార్టీ అధినేత అసదుద్ధీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ వంద సీట్లలో పోటీ చేస్తోందని ఆయన శుక్రవారం జాతీయ మీడియాతో వెల్లడించారు. తమ పార్టీకి బీజేపీతో ఎలాంటి రహస్య అవగాహన లేదని ఆయన స్పష్టం చేశారు. త్వరలో జరుగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వంద నియోజకవర్గాలలో బరిలో దిగుతోందని ప్రకటించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల నుంచి తమ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా దరఖాస్తులు చేసుకుంటున్నారని వివరించారు. భాగేదారి సంకల్ప్​ మోర్చా నేత ఓంప్రకాశ్ రాజ్భర్‌తో తమ పార్టీ సంప్రదింపులు కొనసాగుతాయని తెలిపారు.

తమతో కలిసి పోటీ చేసే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని కానీ, ఆ పార్టీ తమతో కలిసి పనిచేయడానికి నిరాకరించలేదని స్పష్టం చేశారు. ఓంప్రకాశ్‌తో తమ పొత్తు చర్చలకు తాత్కాలికంగా బ్రేక్ ​పడిన విషయం వాస్తవమని, కానీ, అది కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే ఏ శక్తితోనైనా కలవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తమ పార్టీ మైనార్టీ ఓట్లను చీల్చి బీజేపీకి పరోక్షంగా సహకరిస్తోందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. తమ పార్టీ ఏనాడూ బీజేపీకి ‘బీ’ టీమ్‌గా పనిచేయలేదని స్పష్టం చేశారు. బీజేపీని బలంగా ఎదుర్కొనే సత్తా ఉన్న ఏకైక పార్టీ తమదేనని స్పష్టం చేశారు. యూపీలో సమాజ్​వాది పార్టీ, బహుజన సమాజ్​ పార్టీలకు మైనార్టీలు ఓటు వేసినప్పటికీ ఆ పార్టీలు ముస్లీంల హక్కుల రక్షణ కోసం పోరాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ​నుంచి వచ్చి ఉత్తరప్రదేశ్‌లో మీ పార్టీ పాగా వేయగలుగుతుందా? అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. బీహార్, మహారాష్ట్ర ఎన్నికల్లో తాము సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం అన్నారు. గుజరాత్​ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ ఢిల్లీలో ప్రధాన మంత్రి పదవిని అధిష్టంచగా లేనిది.. తామెందుకు యూపీలో విజయం సాధించలేమని ఆయన బదులిచ్చారు.

Advertisement

Next Story