ధాన్యం దందా షురూ.. కేసీఆర్ ప్రకటనతో మిల్లర్ల మాస్టర్ ప్లాన్

by Shyam |
ధాన్యం దందా షురూ.. కేసీఆర్ ప్రకటనతో మిల్లర్ల మాస్టర్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సాగు కష్టాలు మొదలయ్యాయి. మొన్నటి వరకూ విత్తనాలు, ఎరువుల కోసం ఇబ్బందులు పడే రైతులు ఇప్పుడు ఏం పంట వేయాలి, వేస్తే ఎక్కడ అమ్ముకోవాలంటూ ఆందోళన పడుతున్నారు. ప్రభుత్వం ఓవైపు వరిసాగు వద్దంటుంటే.. మరోవైపు గ్రామాల్లో సాగు పనులు నెమ్మదించాయి. వరి తప్ప వేరే పంటలు వేయలేని పరిస్థితులు దాదాపు 60% నెలకొన్నాయి. నాట్లు వేగం పుంజుకున్నాయి. ఈ నెల 24 నాటికే వరి సాగు 55 వేల ఎకరాలకు చేరింది.

గ్రామాల్లోకి మిల్లర్లు..

రాష్ట్రంలో రైసు మిల్లర్లు గ్రామాలను పంచుకున్నారు. మధ్య తరహా, పెద్ద తరహా మిల్లులు గ్రామాల్లో రైతులతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఈసారి ఏకంగా కాగితాలే రాసుకుంటున్నారు. పండించిన ధాన్యం కొంటామని, కానీ ధర ముందుగానే నిర్ణయిస్తామని రైతులకు తెగేసి చెబుతున్నారు. యాసంగి ధాన్యం కొనేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు గ్రామాల్లో మిల్లర్లు చెప్పిందే ధరగా మారిపోయింది.

మద్దతు ధర రూ. 1,900కుపైగా ఉంటే.. ఇప్పుడు మిల్లర్లు చెప్పుతున్న ధర కేవలం రూ. 1,300 నుంచి రూ. 1,500 వరకే. దీనితో పాటుగా తాలు, మట్టి వంటి ఇతర కోతలు ఉండనే ఉంటాయి. ప్రస్తుతానికి చాలా మంది రైతుల దగ్గర క్వింటాకు రూ. 1,300 చొప్పున అగ్రిమెంట్లు చేసుకున్నారు. దీనికోసం మిల్లర్లు బృందాలు ఏర్పడి గ్రామాల్లో కమీషన్​ ఏజెంట్లుగా మారిపోయారు. రైతులతో మాట్లాడించి, తక్కువ ధరకు విక్రయించుకునేలా చేయడమే ఇప్పుడు వారి పని. ఇప్పుడు ఒప్పుకోకుంటే తర్వాత ఎవరూ పంట కొనరని, ఈ ధర కూడా రాదంటూ బెదిరింపులకు సైతం దిగుతున్నారు.

బియ్యం ఇస్తాం.. కొంటారా..?

ఇక సన్నాలు సాగు చేసే రైతులు పట్టణాల్లో అపార్ట్​మెంట్ల వెంట తిరుగుతున్నారు. కొన్నిచోట్ల బియ్యం వ్యాపారులతో కూడా మాట్లాడుకుంటున్నారు. సన్నాలు సాగు చేస్తున్నామని, క్వింటాకు రూ. 3200 నుంచి రూ. 3500 వరకు బియ్యాన్ని అమ్ముతామని, బల్క్​గా ఐదు, పది క్వింటాళ్లు తీసుకుంటే ఎంతో కొంత తక్కువకు ఇస్తామంటూ బతిమిలాడుకుంటున్నారు. క్వింటా నుంచి మొదలుకుని ఎంత కొన్నా ఇంటికి తీసుకువచ్చి బియ్యం ఇచ్చి వెళ్తామంటూ చెప్పుతున్నారు. ఇలా క్వింటా, రెండు క్వింటాళ్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. చాలా ప్రాంతాల్లో బియ్యం అమ్ముతామంటూ రైతులు పట్టణాల్లో తిరుగుతున్నారు. ఒక్క రైతు దగ్గర 30 క్వింటాళ్ల వరకు కొంటామని ఒప్పందాలు కుదిరితే సాగు పనులు మొదలుపెడుతున్నారు.

కౌలుదార్ల కష్టాలు..

మరోవైపు కౌలు రైతులకు మరింత కష్టాలు మొదలయ్యాయి. ప్రతి వానాకాలం సీజన్​కు ముందే కౌలు తీసుకుని సాగు పనులు మొదలుపెట్టుతారు. అయితే ఇప్పుడు యాసంగిలో వరిసాగును తగ్గిద్దామనుకుంటే సాధ్యం కావడం లేదు. ఇప్పటికే కౌలు చెల్లించి తీసుకున్న భూమిని సాగు చేయకుండా ఉండలేమంటున్నారు. వచ్చిన ధరకే అమ్ముకుందామంటూ వరినార్లు మొదలుపెట్టారు.

Advertisement

Next Story

Most Viewed