బావిలో 9 మృతదేహాలు.. అనేక అనుమానాలు?

by Shyam |   ( Updated:2020-05-22 21:06:08.0  )
బావిలో 9 మృతదేహాలు.. అనేక అనుమానాలు?
X

దిశ, వరంగల్: వరంగల్‌ నగర శివారులోని గొర్రెకుంట ఇండస్ట్రియల్ ప్రాంతంలో గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావి సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. బావిలోంచి రోజుకిన్ని డెడ్‌బాడీస్ బయటపడుతున్నాయి. అవి హత్యలా, ఆత్మహత్యలా అనేది తెలియడంలేదు. ఇప్పటివరకు మొత్తం 9 మృతదేహాలు లభించాయి. నిన్న నాలుగు, నేడు మరో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. మొత్తం తొమ్మిది మృతదేహాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురివి ఉండటం‌ సంచలనం కలిగించింది. పాడుపడిన బావిలో తొమ్మిది మంది శవాలు లభ్యమవడం పట్ల అనేక అనుమానాలు వెల్లువెత్తాయి. హత్యలా? ఆత్మహత్యలా? అనేది మిస్టరీగా మారింది. ఈ మేరకు పోలీసులు కేసు మిస్టరీని ఛేదించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతులను పశ్చిమ బెంగాల్ కు చెందిన మసూద్ అలం (50), ఆయన భార్య నిషా అలం (45) , కూతురు బుస్రా అలం (22), బూస్రా కొడుకు(3), మసూద్ కుమారులు శబాజ్ అలం (21), సోహిల్ అలం (20), డ్రైవర్ షకీల్ (40), బీహార్ కు చెందిన శ్రీరామ్(35), శ్యామ్ (40) లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సంఘటనాస్థలిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్‌ సీపీ రవీందర్‌, మేయర్‌ ప్రకాశ రావు, కలెక్టర్ హరిత పరిశీలించారు.
* అసలేం జరిగింది..?
మసూద్ 20 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం నుంచి బతుకుదెరువు కోసం కుటుంబంసహా వరంగల్‌కు వలస వచ్చాడు. తొలుత కరీమాబాద్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండేవారు. డిసెంబరు నుంచి గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వరంగల్‌ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో నెలన్నర నుంచి గోదాంలోనే ఉన్న రెండు గదుల్లో మసూద్‌, భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. భర్తతో విడిపోయిన కుమార్తె బుస్రా తన కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వీరితోపాటు బీహార్‌కు చెందిన యువకులు శ్రీరాం, శ్యాంలు అదే ఆవరణలోని మరో గదిలో ఉంటూ గోదాంలో పనిచేస్తున్నారు. సాయి దత్తా కంపెనీ యజమాని సంతోష్‌ రోజు మాదిరిగానే గురువారం మధ్యాహ్నం గోదాంకు వచ్చే చూసేసరికి కార్మికులెవరూ కనిపించలేదు. పరిసరాల్లో అన్వేషించినా జాడ లేకపోవడంతో అనుమానంతో పక్కనే ఉన్న పాడుబడ్డ బావిలో చూడగా నాలుగు మృతదేహాలు నీళ్లలో తేలుతూ కనిపించాయి. వెంటనే గీసుకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. వరంగల్‌ నగరపాలక సంస్థ సిబ్బంది, రెస్క్యూ టీం సభ్యులు, పోలీసులు కలిసి మృతదేహాలను తాళ్లతో వెలికి తీశారు.

నేడు ఐదు మృతదేహాలు
నేడు ఉదయం బావి పరిసరాల్లోకి వాకింగ్ కు వెళ్లిన గొర్రెకుంట గ్రామస్థులు మరో మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ టీం సాయంతో మొత్తం ఐదు మృతదేహాలను కనుగొన్నారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

* అనుమానాలెన్నో…
గొర్రెకుంట సమీపంలోని పాడుపడిన బావిలో తొమ్మిది మృతదేహాలు లభ్యమవడం కలకలం రేపింది. చనిపోయిన వారంతా వలస కూలీలు కావడంతో ఆర్థిక సమస్యలు ప్రధాన కారణం అయి ఉండొచ్చనే ప్రచారం జరిగింది. కొంతకాలంగా మృతులంతా కంపెనీ పనుల్లో బిజీగా ఉన్నారని ఆర్థిక సమస్యలు లేవని ఫ్యాక్టరీ యాజమాని చెబుతున్నట్లు తెలుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో వారికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదనే వాదనలున్నాయి. భర్తతో విడిపోయిన మసూద్ కూతురు బుస్రా నగరంలోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతున్నట్లు సమాచారం. దీంతో బుస్రాకు తన తల్లితో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంటిపై ఉంటున్న బీహార్‌కు చెందిన కార్మికులు శ్రీ రాం, శ్యామ్ లు వీరి గొడవలో కలగజేసుకోవడంతో పాటు బుస్రాపై కన్నేసినట్లు వినికిడి.‌ ఈ విషయం తెలుసుకున్న బుస్రా ప్రియుడు వారితో‌ గొడవపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల కిందట మసూద్ ఇంట్లో విందు జరిగినట్లు తెలుస్తోంది. విందులో జరిగిన ఘర్షణతో బీహార్ యువకులు మసూద్ కుటుంబాన్ని చంపి బావిలో పడేసి భయంతో వారు ఆత్మహత్య కు పాల్పడి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం ప్రాథమిక సమాచారం మేరకు వారి మరణాలు ఆత్మహత్యగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed