ట్రంప్‌కు షాకిస్తున్న కోర్టులు.. రిపబ్లికన్స్ సైతం!

by Anukaran |   ( Updated:2020-11-06 00:49:31.0  )
ట్రంప్‌కు షాకిస్తున్న కోర్టులు.. రిపబ్లికన్స్ సైతం!
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. రిపబ్లికన్ , డెమొక్రటిక్ పార్టీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ నడుస్తోంది. ఇప్పటికే జో బైడెన్ విజయానికి కొద్ది దూరంలో నిలవగా, ట్రంప్ వెనుకబడ్డారు. అధ్యక్ష అభ్యర్థులు శ్వేతసౌధంలో అడుగుపెట్టాలంటే 538 ఎలక్టరోల్ ఓట్లకు గాను 270 మ్యాజిక్ ఫిగర్‌ను సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జో బైడెన్‌కు 264 ఎలక్టరోల్ ఓట్లు పోలవ్వగా, ప్రెసిడెంట్ ట్రంప్‌కు 214 వచ్చాయి. మరో ఆరు ఓట్లు సాధిస్తే జో బైడెన్ అమెరికా తర్వాతి అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలోనే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపివేయాలని ట్రంప్ శిబిరం కోర్టును ఆశ్రయించింది. అయితే, ఆ పిటిషన్‌ను మిచిగాన్ కోర్టు జడ్జి కొట్టివేయగా, పెన్సిల్వేనియా జడ్జి మాత్రం కౌంటింగ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపడానికి వీల్లేదని తీర్పునిచ్చారు. దీంతో ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

అయితే, ఏయే రాష్ట్రాల్లో ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుందో ఆయా రాష్ట్రాల్లోని కోర్టుల్లో ట్రంప్ శిబిరం పిటిషన్లు దాఖలు చేసింది. లేటుగా పోలయ్యే పోస్టల్ ఓట్లను ట్రంప్ ‘ఇల్లీగల్’గా పరిణిస్తున్నామన్నారు. పోస్టల్ ఓటింగ్ ఫ్రాడ్ ముమ్మాటికీ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అరిజోనా, నార్త్ కరోలినా, జార్జియా, నెవాడా, పెన్సిల్వేనియాలో కౌంటింగ్ నడుస్తోంది. జో బైడెన్ ప్రెసిడెంట్ అవ్వాలంటే ఏదేని రెండు రాష్ట్రాలు గానీ, పెన్సిల్వేనియా గానీ గెలవడం తప్పసనిసరి. ట్రంప్ విషయానికొస్తే ఏదేనీ మూడు రాష్ట్రాలు, ముఖ్యంగా పెన్సిల్వేనియాలో గెలిస్తే మరోసారి అధ్యక్షుడిగా కొనసాగవచ్చు. అరిజోనా, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సల్వేనియాల్లో ట్రంప్ గెలిస్తే ఫలితం ‘టై’కానుంది. అయితే, మిచిగాన్‌లో కౌంటింగ్ ఆపాలని, అరిజోనాలో కౌంటింగ్ కొనసాగించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు.

కాగా, అమెరికా ప్రజల మద్దతు బైడెన్ కే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బైడెన్- ట్రంప్ మధ్య 40 లక్షల ఓట్ల తేడా కనిపిస్తోంది. అయినా, ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు -270 ఎవరైతే సాధిస్తారో వారినే అధ్యక్ష పీఠం వరించనుంది. తాజా న్యూస్ ప్రకారం జార్జియా, పెన్సిల్వేనియాల్లో బైడెన్‌కు అనుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పోస్టల్ ఓట్లలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని అమెరికన్స్ భావిస్తున్నారు. అంతేకాకుండా, ట్రంప్ ప్రమాదకరమైన ప్రకటనలు చేస్తున్నారని రిపబ్లికన్ సెనేటర్లు సైతం మండిపడుతున్నారు. మరోవైపు అమెరికన్ మీడియాపై ట్రంప్ చిందులేస్తున్నట్లు సమాచారం. తాజాగా ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో అక్కడి ప్రముఖ మీడియా ఛానళ్లు లైవ్ కట్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story