కరోనా వేళ..అక్కడ ‘పని’ ఫుల్లు..

by Shyam |
కరోనా వేళ..అక్కడ ‘పని’ ఫుల్లు..
X

దిశ, నల్లగొండ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధి హమీ పనులు ఊపందుకున్నాయి. గతవారం వరకు కరోనా వైరస్ భయానికి బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో గడిపిన జనం ఇప్పుడు ఉపాధి పనుల వైపు మళ్లారు. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్-19) కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో పేద, మధ్యతరగతి ప్రజల జీవనం అతలాకుతలమైంది. ఈ ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. అసంఘటిత, భవన నిర్మాణ రంగాల్లోని దినసరి కూలీలు, చిరు వేతన జీవులందరికీ పనులు బందయ్యాయి. వారికి పూట గడవడమే కష్టంగా మారింది. తోపుడు బండ్ల వ్యాపారులు, ఫుట్‌పాత్ వ్యాపారులు, ఊళ్లల్లో తిరిగి చిన్నచిన్న సామాన్లు అమ్ముకునే ప్రతిఒక్కరికీ ఉపాధి లేకుండా పోయింది. దాంతో పట్టణాల్లో ఏదో ఒక పని చేసుకుందామని వెళ్లిన వారంతా ఇప్పుడు గ్రామాల బాట పట్టారు. వారంతా ప్రస్తుతం ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు.

కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం..

ఈ ఏడాది పనుల ప్రారంభంలో కరోనా కారణంగా కూలీల హాజరు శాతం తగ్గింది. అయితే, ఆ తర్వాత క్రమంగా కూలీలు పెరిగారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 71 మండలాల పరిధిలో 1,741 గ్రామాలు ఉన్నాయి. దాదాపు అన్ని గ్రామాల్లో ప్రస్తుతం ఉపాధి పనులకు వెళ్తున్నారు. నల్లగొండ జిల్లాలో 31 మండలాల్లోని 845 గ్రామ పంచాయతీ పరిధిలో 3,70,959కు పైగా జాబ్ కార్డులున్నాయి. దీంతో ఆయా జాబ్ కార్డుల్లో కూలీలుగా నమోదైన వారంతా ఇప్పడు పలుగు, పార పట్టుకుని ఉపాధి పనులకెళ్తున్నారు. ఒక్క నల్లగొండ జిల్లా పరిధిలోనే నిత్యం ఉపాధి కూలీల పనులకు దాదాపు రూ.2కోట్లకు పైగా నగదు ఖాతాల్లో జమ అవుతుంది. మార్చి 21న జిల్లాలో ఉపాధి పనులకు 9,700 మంది కూలీలు మాత్రమే హాజరయ్యారు. కానీ, ప్రస్తుతం ఉపాధి కూలీల సంఖ్య 1.50 లక్షలకు పైగా ఉన్నది. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉపాధి హామీ జాబ్ కార్డులు 2,49,568 ఉండగా, కూలీలు 8,30,814 మంది ఉన్నారు. ఇందులో గత వారం కేవలం 10 వేల మంది కూలీలు మాత్రమే పనులకు హాజరయ్యారు. కానీ, ఈ వారం 1,49,496 మంది కూలీలు పనులకు వస్తున్నారు. గతేడాది ఈ రోజుల్లో 2.30 లక్షలకు పైగా ఉపాధి కూలీలు పనులకు వచ్చారు. గతంలో రోజుకు కూలీ రూ.211 ఉంటే..ఈ ఏప్రిల్ నుంచి దాన్ని రూ.237కు పెంచారు. దీంతో మరింతగా కూలీలు పనులకు వచ్చే కూలీల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం చేస్తున్న పనులు ఇవీ..

ఉపాధి హామీ పనుల్లో భాగంగా ప్రస్తుతం రహదారుల నిర్మాణ పనులు, కట్ట కాలువలు, చెరువులు, కుంటల పూడికతీత, హరితహారం తదితర పనులను కూలీలు చేస్తున్నారు. ఇదీగాక నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని అక్కెనపల్లిలో ఉపాధి హామీ కింద ఫీడర్ ఛానల్ పూడికతీత పనులు చేయిస్తున్నారు. దీంతో ఇటు కూలీలకు ఉపాధితో పాటు రైతులకు సాగునీటి తిప్పలు తప్పనున్నాయి.

జిల్లాల వారీగా ఉపాధి జాబ్ కార్డుల వివరాలు..

నల్లగొండ 3,70,959.

సూర్యాపేట 2,10,000.

యాదాద్రిభువనగరి 1,47,000

Tags: corona times, lock down, unorganised sector, people, going to, mgnreaga works

Advertisement

Next Story

Most Viewed