ఎంజీఎం ఆస్పత్రి.. డాలు లేకుండా ‘కరోనా’తో కత్తి యుద్ధమా?

by Shyam |   ( Updated:2020-03-31 06:59:13.0  )
ఎంజీఎం ఆస్పత్రి.. డాలు లేకుండా ‘కరోనా’తో కత్తి యుద్ధమా?
X

దిశ, న్యూస్ బ్యూరో:

కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు లాక్‌డౌన్ నిర్ణయాలు తీసుకున్నాయి. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఈ చర్యలు ఒక మేరకు ఫలితాలు ఇస్తున్నాయి. అయినా కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రెండంకెలు దాటి మూడంకెలకు చేరువవుతోంది. మృతుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రం మొత్తం మీద సుమారు 13వేల ఐసొలేషన్ బెడ్‌లను సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. కరోనా మహమ్మారిని తెలంగాణ గడ్డ నుంచి తరిమేస్తామన్నారు. కానీ క్షేత్రస్థాయిలోని పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఆయుధాలు లేకుండానే సైనికులు యుద్ధానికి వెళ్తున్నట్లుగా ఉంది. కరోనా పేషెంట్లకు చికిత్స అందించే డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ స్టాఫ్ మొదలు ఆయా వరకు సరైన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ), ఎన్-95 మాస్కులు, గ్లవుజులు అందుబాటులో లేవు. జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బందే నెత్తీనోరు మొత్తుకుని చెప్తున్నారు. సేవలందించడానికి సిద్ధంగానే ఉన్నా పీపీఈలు లేకుంటే మాత్రం విధులు నిర్వర్తించబోమని సమ్మె జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర వైద్య విద్య శాఖ డైరెక్టర్‌కు సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. గాంధీ ఆసుపత్రి నర్సులు కూడా ఇటీవల ఇదే తరహాలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. స్టేజ్-2లో ఇంకా ఐసొలేషన్ దశలోనే ఉన్న ప్రభుత్వ ఏర్పాట్లు రేపు స్టేజ్-3కి వెళ్తే, ముఖ్యమంత్రి మాటల్లోనే చెప్పాలనుకుంటే ‘ఊహించని విస్ఫోటనం’ జరిగితే, రాష్ట్రంలోని వైద్య సౌకర్యాలు సరిపోతాయా, పరిస్థితి అదుపులో ఉంటుందా అనే సందేహాలు వైద్య సిబ్బంది నుంచే వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రేపు చేయిదాటిపోయే పరిస్థితి వస్తే ఎలా అనే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.

వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తే… ప్రభుత్వం చెప్తున్న వివరాలకు, ఎంజీఎం ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బంది చెప్తున్న వివరాలకు పొంతనే లేదు. క్షేత్రస్థాయి వివరాలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంలేదా? లేకుంటే ప్రభుత్వానికి చెప్పడానికి తగిన మెకానిజం లేదా? గ్రౌండ్ లెవల్ రిపోర్టుతో ప్రభుత్వం ‘ఆల్ ఈజ్ వెల్’ అనే అంచనాకు వచ్చిందా? వికేంద్రీకరణ లేకుండా ఒక్కచోటే అధికారాలు కేంద్రీకృతం కావడం దీనికి కారణమా? లేకుంటే ప్రభుత్వ హైరార్కీ మెకానిజంలోనే లోపం ఉందా? పీపీఈలు తగిన సంఖ్యలో అందుబాటులో లేకుండానే ప్రభుత్వం ‘ఎలాంటి విస్ఫోటనం జరిగినా సర్వ సన్నద్ధంగా ఉన్నాం’ అని ముఖ్యమంత్రి ఎందుకు చెప్తారు? అంటే అన్ని సౌకర్యాలూ ఉన్నా క్షేత్రస్థాయి వరకు అవి అందడంలేదా? ఇప్పుడు ఈ సందేహాలన్నీ ఎంజీఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫేకల్టీ మొదలు జూనియర్ డాక్టర్ వరకు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఒకటి రెండు ప్రైవేటు ఆసుపత్రులు మినహా కరోనా కేసులన్నింటికీ చికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతోంది. ఏ సమయంలో ఎలాంటి సేవలందించడానికైనా సిద్ధంగా ఉన్నామని జూనియర్ డాక్టర్ల మొదలు ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్ల వరకు ప్రభుత్వానికి స్పష్టత ఇచ్చారు. కానీ పీపీఈలను సమకూరిస్తేనే అనే షరతు వినిపిస్తోంది. దీన్ని ప్రభుత్వం ఎలా నివృత్తి చేస్తుందనేది కీలకంగా మారింది.

వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో ప్రభుత్వం 150 ఐసొలేషన్ బెడ్‌లను, మరో 25 ఐసీయూ బెడ్‌లను కరోనా పేషెంట్ల కోసం సిద్ధం చేస్తోంది. ఐసీయూ బెడ్‌లకు వెంటిలేటర్ సౌకర్యం కూడా ఉన్నట్లు ప్రభుత్వం చెప్తోంది. ఇందులో దాదాపు 15 వెంటిలేటర్లు ప్రైవేటు ఆసుపత్రుల నుంచే సమకూరాయి. ప్రభుత్వం ఇచ్చింది కేవలం పది మాత్రమే. ఇక పీపీఈల విషయంలో చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. ప్రైవేటు మార్కెట్‌లో దొరకకపోవడంతో ప్రభుత్వంపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో ఐసొలేషన్ వార్డులో విధులు నిర్వర్తించే డాక్టర్లకు మాత్రమే ఇస్తూ దాన్ని ఆనుకుని ఉన్నవార్డుల్లోని వైద్య సిబ్బందికి అందడంలేదు. ఏ సమయంలో వైరస్ ఐసొలేషన్ వార్డు నుంచి ఇతర వార్డులకు వ్యాపిస్తుందో అనే భయాలు డాక్టర్లలో నెలకొన్నాయి. దీంతో వైరస్ ఇకపైన డాక్టర్ల ద్వారానే పేషెంట్లకు కుటుంబ సభ్యులకు కూడా వ్యాపిస్తుందా అనే అనుమానాలు వారి నుంచి వ్యక్తమవుతున్నాయి. రానున్న ‘విస్ఫోటనం’ను తట్టుకునేంత దూరదృష్టితో ప్రభుత్వ ఏర్పాట్లు లేవనేదే డాక్టర్ల ఆందోళన.

పరిష్కారమేంటి?

కొన్ని అత్యవసర సమయాల్లో ఆసుపత్రి సూపరింటెండెంట్లే స్వంత నిర్ణయం తీసుకుని అవసరాలను సమకూర్చుకునే వెసులుబాటు ఉండాలని ప్రస్తుత కరోనా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అయితే తనిఖీ చేసే మెకానిజం ఉండదు కాబట్టి నిధుల దుర్వినియోగం లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆ డబ్బును రాబట్టాలి. స్థానికంగా సమకూర్చుకునే వెసులుబాటుతో పాటు శాఖాపరమైన చర్యలూ ఉండాలి. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వాధికారులు సమకూర్చుకునే వైద్య ఉపకరణాలకు, అవసరాలకు ఎక్కువ రేటును కోట్ చేసి అమ్మాలని ప్రయత్నించే ప్రైవేటు కంపెనీలనూ నియంత్రించాలి. అవసరమైతే ఆ కంపెనీల లైసెన్సు రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వానికి సరఫరాచేసే కంపెనీల జాబితా నుంచి సదరు కంపెనీకి అర్హత లేకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలి. తయారుచేసే కంపెనీ మొదలు డిస్ట్రిబ్యూటర్, డీలర్ వరకూ ఎక్కువ ధరలు అమ్మకుండా ప్రభుత్వం తరఫున కట్టుదిట్టమైన నిబంధనలు ఉండాలి. నిత్యావసరాలను ఎక్కువ ధరకు అమ్ముతున్న దుకాణాలపై ప్రభుత్వ, చర్యలు తీసుకుంటున్నట్లుగానే ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో సొమ్ము చేసుకోవాలనుకునే కంపెనీలు, దుకాణాలపైనా కూడా చర్యలు ఉండాలి.

పరిమిత సంఖ్యలోనే వస్తున్నాయి : సూపరింటెండెంట్

”కరోనా జాగ్రత్తల్లో భాగంగా మా ఆసుపత్రిలో ఓపీలు దాదాపు మూడవ వంతుకు పడిపోయి ఇప్పుడు రోజుకు సగటున వెయ్యి వరకు మాత్రమే చూస్తున్నాం. ఇన్ పేషెంట్ల సంఖ్య సైతం దాదాపు సగం తగ్గిపోయింది. రోజుకు 600 వరకు ఉంటున్నాయి. ఎలెక్టివ్ సర్జరీలన్నింటిని నిలిపేశాం. ఐసొలేషన్ వార్డులోని డాక్టర్లు, వైద్య సిబ్బందికి మాత్రమే పీపీఈలు, ఎన్-95 మాస్కులు ఇస్తున్నాం. అవసరానికి సరిపడేంత సంఖ్యలో లేవు. పొదుపుగా వాడుకుంటున్నాం. ప్రభుత్వానికి ఆర్డర్ పెడితే రోజుకు పాతిక వరకు వస్తున్నాయి. కానీ ఇవి అవసరానికి సరిపడవు. దేశమంతా కొరత ఉంది కాబట్టి మేం కూడా సర్దుకుంటున్నాం. ఇంతటి కొరత ఉంది కాబట్టే ఎమర్జెన్సీ వార్డుల్లోని డాక్టర్ల వరకు పీపీఈలు ఇవ్వలేకపోతున్నాం. అయితే వారిలో మాత్రం వైరస్ అంటుకుంటుందేమో అనే భయాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. చాలాసార్లు పీపీఈలను సమకూర్చాల్సిందిగా అడిగారు. ఎప్పటికప్పుడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నాం. నిధులకు కొరత లేదు. కానీ సమకూర్చుకోడానికి మాత్రం కలెక్టర్ ద్వారానే సాధ్యమవుతుంది. ఒక ప్రైవేటు ఉత్పత్తిదారుడి నుంచి సమకూర్చుకునే ప్రయత్నం చేశాం. కానీ ధర ఎక్కువ ఉండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాం. పీపీఈల కొరత కారణంగా ఇతర వార్డులకు వైరస్ వ్యాప్తి చెందకుండా మా స్థాయిలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం” అని ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

నెక్స్ట్ లెవల్ గురించి ఆలోచించడంలేదు : ఆసుపత్రి ఫేకల్టీ

”వైరస్ విస్తృతంగా వ్యాపించి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ స్థాయికి వెళ్తే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఇది ఎంజీఎంలోనే కాదు. మొత్తం దేశమంతా ఇలానే ఉంది. ప్రస్తుతానికి మనం ‘లౌక్‌డౌన్’ను దృష్టిలో పెట్టుకుని ఐసొలేషన్ వార్డుల స్థాయిలోనే ఆలోచిస్తున్నాం. కానీ విస్తృతంగా వ్యాప్తిస్తే ఎలా డీల్ చేయాలనేదానిపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. ప్రైవేటు ఆసుపత్రులన్నింటినీ ఆధీనంలోకి తెచ్చుకుని పేషెంట్లకు చికిత్స చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వార్డుల అవసరాలకే పీపీఈలు, మాస్క్‌లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ప్రైవేటు ఆసుపత్రులను రెడీ చేసుకున్నా సేవలెలా అందుతాయి? జూనియర్ డాక్టర్లు సమ్మె చేసే దాకా వెళ్ళిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు సేవలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అవసరమైన పీపీఈలను ప్రభుత్వం సమకూర్చగలుగుతుందా? కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు పీపీఈలను సమకూర్చుకోడానికి ప్రయత్నిస్తే లాక్‌డౌన్ సమయంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. ఆసుపత్రి డాక్టర్లుగా మేం కొద్దిమంది ప్రైవేటు సంస్థలను సంప్రదించాం. అయితే విధులకు హాజరుకావడంలో పోలీసుల నుంచి ఆంక్షలు, ముడిపదార్ధాల రవాణాకు ఉన్న ఇబ్బందులు, ఉత్పత్తి చేయడానికి ఉన్న అసౌకర్యం.. ఇలాంటి పలు కారణాలతో ఇప్పుడు సరఫరా చేయలేమంటూ నిరాకరించాయి. అత్యవసర సేవల్లో భాగంగా ఇలాంటి సంస్థల యాజమాన్యంతో ప్రభుత్వాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడి తగిన వెసులుబాటు కల్పించినట్లయితే కొరత సమస్యను అధిగమించవచ్చు. తయారీని పెంచుకోవచ్చు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు లేవు. పైగా క్షేత్రస్థాయిలోని సమస్యలు ముఖ్యమంత్రి స్థాయి వరకూ వెళ్ళలేకపోతున్నాయి. కారణం సూపరింటెండెంట్, కలెక్టర్, డీఎంఈ, వైద్యశాఖ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య మంత్రి… ఇలా పలు స్థాయిలను దాటి వెళ్ళడానికి ‘హైరార్కీ’ ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా వసతులను, ఉపకరణాలను సమీకరించుకోడానికి సూపరింటెండెంట్, కలెక్టర్ స్థాయిలోనే వెసులుబాటు ఉంటే ప్రతీదానికీ ప్రభుత్వంపైన ఆధారపడే అవసరం ఉండదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక స్టేజ్-3కి వెళ్ళిన తర్వాత క్రైసిస్ పెరిగితే ఎక్కువ సమయాన్ని ఇలాంటి చర్చలు, విజ్ఞప్తులకే వెచ్చించాల్సి వస్తుంది. పేషెంట్లకు సకాలంలో సేవలు ఇవ్వలేం. ఊహించని ప్రమాదం ముంచుకొస్తుంది. దీన్ని ప్రభుత్వం గ్రహించాలి” అని ఎంజీఎం ఆసుపత్రిలోని ఒక ఫేకల్టీ డాక్టర్ (పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు) అభిప్రాయపడ్డారు.

మామూలు మాస్కులకే దిక్కు లేదు : డాక్టర్

”కోవిడ్ వార్డుల్లోని డాక్టర్లకు కొంతవరకైనా పీపీఈలు, మాస్క్‌లు అందుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ ఒకే పీపీఈతో నెట్టుకొస్తున్నారు. కారణం కొరతే. కానీ నర్సుల స్థాయిలో మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన పీపీఈలు ఇవ్వడంలేదు. గతంలో హెచ్ఐవి కేసులకు వాడే డ్రెస్ వాడాల్సి వస్తోంది. ప్రతీరోజు కోవిడ్ లక్షణాలతో పేషెంట్లు వస్తున్నారు. రిసెప్షన్ దగ్గరి నుంచి ఎమర్జెన్సీ వార్డు వరకు వారు మాస్కులు లేకుండానే వెళ్ళాల్సి వస్తోంది. డాక్టర్లకే మామూలు డిస్పోజబుల్ మాస్కులు దిక్కులేదు. ఉదయం ఇచ్చినదాన్ని రాత్రి వరకూ వాడాల్సి వస్తోంది. ప్రతీ నాలుగు గంటలకు దాన్ని మార్చాల్సి ఉన్నా మరో గత్యంతరం లేక డ్యూటీ ముగిసేదాకా వాడాల్సి వస్తోంది. కొన్నిసార్లు కర్చీఫ్‌లను కట్టుకుంటున్నాం. ఓపీ కోసం వచ్చిన పేషెంట్ పాజిటివ్ అయినట్లయితే ఎమర్జెన్సీ వార్డుల్లోని పేషెంట్లకూ అంటుకునే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. వారిని చూసే డాక్టర్లుగా మేమే వైరస్‌ను మోసుకెళ్తున్నామేమో అనే భయం ఉంది” అని ఓ డాక్టర్ వ్యాఖ్యానించారు.

సూపరింటెండెంట్‌కు చెప్పినా ప్రయోజనం లేదు : జూనియర్ డాక్టర్

”నీలోఫర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లకు వైరస్ ఎలా సోకిందో చూస్తున్నాం. పీపీఈల ప్రాధాన్యతను, వైరస్ ప్రమాదాన్ని కలెక్టర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలోనే జూనియర్ డాక్టర్లుగా మా అభిప్రాయం చెప్పాం. అప్పటికే సూపరింటెండెంట్‌కు విజ్ఞప్తి కూడా చేశాం. కానీ ఆ సమావేశంలో అంతా బాగుందని, అన్నీ ఉన్నాయంటూ ఆయన కలెక్టర్‌కు చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డుల్లో సర్జరీలకు వాడే ప్లాస్టిక్ ఆపరాన్‌లను వాడుతున్నాం. కరోనా ఐసీయూ వార్డులో ఆక్సిజన్ సౌకర్యం కూడా లేకపోవడంతో కొన్ని మెడికల్ డివైజెస్‌ని ఎక్యూట్ మెడికల్ కేర్ ఐసీయూ నుంచి షిప్ట్ చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం నుంచి సపోర్టు ఏ మేరకు ఉందో తెలియదుగానీ ఇక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం ప్రభుత్వం దాకా వెళ్ళడంలేదని కలెక్టర్ సమావేశం చూసిన తర్వాత అర్థమైంది. ఐసొలేషన్ వార్డుల్లో బెడ్స్ లేకపోవడంతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల నుంచి సమకూర్చుకున్నాం. వెంటిలేటర్ల పరిస్థితి కూడా అంతే. గతంలో డీఎంఈకి పీపీఈల కొరత గురించి చెప్పాం. సమకూరుస్తామన్నారు. వారం రోజులైంది. రానే లేదు. ప్రైవేటు డీలర్ ఒకరు ఎన్-95 మాస్కులు సరఫరా చేస్తామన్నారు. ధర ఎక్కువనే కారణంతో సూపరింటెండెంట్ స్థాయిలో ఆ ప్రయత్నానికి గండి పడింది. ఐసొలేషన్ వార్డుల నుంచి ఇతర వార్డులకు వైరస్ సోకడానికి చాలా ఆస్కారముంది. పీపీఈలు లేకపోతే జరిగే ప్రమాదాన్ని ఊహించలేం” అని ఓ జూనియర్ డాక్టర్ వాపోయారు.

ఆసుపత్రిలో ఏం జరుగుతుందో తెలియదు : వైద్య కళాశాల డాక్టర్

”విదేశీ ప్రయాణం చేసినవారు కాకుండా ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్రయాణాలు చేసినవారికి పాజిటివ్ ఎలా వస్తూ ఉందో చూస్తున్నాం. ఎవరికి లక్షణాలు ఉన్నాయో, పాజిటివ్ ఉందో తెలియదు. రోజూ ఆసుపత్రికి ఓపీ పేషెంట్లు వస్తున్నారు. వారి ఆరోగ్యస్థితిని బట్టి కొన్నిసార్లు ఎమర్జెన్సీకి తరలిస్తున్నారు. కానీ అక్కడ పీపీఈలు లేకపోవడంతో రిపోర్టు వచ్చేవరకు ఆ పేషెంట్‌కు పాజిటివ్ ఉందో లేదో తెలియదు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే పేషెంట్లకు కూడా కోవిడ్ తరహాలోనే అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రోటోకాల్ పాటించాలని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ చెప్పింది. కానీ సూపరింటెండెంట్ మాత్రం పీపీఈలు అవసరం లేదంటూ తిరస్కరిస్తున్నట్లు అక్కడి డ్యూటీ డాక్టర్లు చెప్తున్నారు. అసలు ఎన్ని పీపీఈలు వస్తున్నాయో, ఎక్కడెక్కడ సప్లయ్ అవుతున్నాయో తెలియదు. డాక్టర్లు మాత్రం చాలా ఆందోళనతోనే ఉన్నారు. డే టు డే పద్ధతిలో పీపీఈలు వస్తున్నాయి తప్ప అవసరానికి సరిపోయేంత సంఖ్యలో రావడంలేదు” అని వైద్య కళాశాల డాక్టర్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed