కోహెడలో రూ. 2 కోట్ల కుచ్చుటోపీ.. రాత్రికి రాత్రే ఎస్కేప్..!

by Sumithra |
కోహెడలో రూ. 2 కోట్ల కుచ్చుటోపీ.. రాత్రికి రాత్రే ఎస్కేప్..!
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: తుర్కయాంజాల్ మున్సిపాలిటీ ప‌రిధి కోహెడ‌లో ప్రజ‌ల‌కు రూ.2 కోట్లకు పైగా కుచ్చుటోపీ వేసి రాత్రికి రాత్రే వ్యాపారి కుంచార‌పు రాజుగుప్తా ప‌రారైన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. విష‌యం తెలుసుకున్న బాధితులు న్యాయం చేయాలంటూ ఊరి న‌డిబొడ్డున సోమ‌వారం బైఠాయించ‌డం స్థానికంగా చ‌ర్చనీయాంశ‌మైంది.

వివ‌రాల్లోకి వెళ్తే… కోహెడ‌కు చెందిన వ్యాపారి కుంచార‌పు రాజుగుప్తా ఊరిలో కిరాణాషాపుతో పాటు చిట్టీలు ఇత‌ర‌త్రా వ్యాపారాలు చేస్తుండేవాడు. ఈ క్రమంలో సుమారు 80మంది ద‌గ్గర ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రి వద్ద వ‌డ్డీ ఇస్తాన‌ని న‌మ్మబ‌లికి రూ.ల‌క్ష నుంచి రూ.10ల‌క్షల వ‌ర‌కు వ‌సూలు చేశాడు. వడ్డీ వస్తుందన్న ఆశతో పలువురు వ్యాపారులు, మధ్య తరగతి వ్యక్తులు అతనికి అప్పు ఇచ్చారు.

సుమారు రూ.2కోట్లకు పైగా అప్పులు తీసుకుని త‌న పిల్లల చ‌దువు, ఇత‌ర వ్యాపారాల్లో వెచ్చించారు. ఇంత‌లో రాజుగుప్తాకు డ‌బ్బులు ఇచ్చిన ఒక్కొక్కరు అడ‌గ‌డం మొద‌లుపెట్టారు. ఓ రాజ‌కీయ నేత ప‌లుకుబ‌డితో ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రికి సెటిల్‌మెంట్ చేయ‌డం స్టార్ట్ చేశారు. 80మందిలో సుమారు 50మందికి తీసుకున్న డ‌బ్బులో 20శాతం తిరిగి ఇచ్చేలా సెటిల్‌మెంట్ చేసి ఇవ్వసాగారు.

కోహెడ‌కే చెందిన ఓ పేద‌ కుటుంబం త‌మ‌కు పూర్తిడ‌బ్బులు కావాల్సిందేన‌ని పట్టుబ‌ట్టి వ్యాపారి ఇంటి ఎదుట ధ‌ర్నాకు దిగింది. దీంతో మిగ‌తావారికి కూడా తెలుస్తుంద‌న్న భ‌యాందోళ‌న‌కు గురైన వ్యాపారి రాజుగుప్తా కొన్ని రోజుల క్రితం భార్యాపిల్లల‌ను న‌గ‌రానికి పంపించి వేశాడు. గ‌త రాత్రి రాజుగుప్తా కూడా త‌న ఇంటికి తాళంవేసి ఉడాయించ‌డంతో బాధితులంతా ల‌బోదిబోమంటున్నారు. సదరు వ్యక్తి ఆచూకీ కోసం ఆరా తీసినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో బాధితులు దిక్కు తోచని పరిస్థితుల్లో ప‌డ్డారు.

అప్పుల‌తో ఉన్నత‌ చ‌దువులు

సుమారు రూ.2కోట్ల వ‌ర‌కు అప్పు చేసిన కుంచార‌పు రాజుగుప్తా త‌న ఇద్దరు కొడుకుల‌ను ఉన్నత‌చ‌దువులు చ‌దివించాడు. ఒక‌రు క‌రెంట్ ఏఈ, మ‌రొక‌రు హెడ్మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నెల‌కు సుమారుగా రూ.3ల‌క్షలకు పైనే వీరి ఆదాయం ఉంటుంద‌ని తెలుస్తోంది. ఊరిలో రెండు ఇళ్లు కూడా ఉన్నాయి. అప్పులు చెల్లించ‌డం వీరికి పెద్ద ప‌నికాక‌పోయినా… డ‌బ్బు ఎగ్గొట్టాల‌న్న ఏకైక ఉద్దేశంతో రాజుగుప్తా కుటుంబం ప‌రారైంద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

మాకు న్యాయం చేయండి..

గ‌త 20ఏళ్లుగా ఫిల్మ్‌సిటీలో రోజుకు రూ.200కు చొప్పున‌ కూలీ ప‌నిచేస్తూ కూతురి పెళ్లి కోసం కొంత మొత్తాన్ని కూడ‌బెట్టుకున్నా. రాజుగుప్తా ఇంటిప‌క్కన వ్యక్తి కావ‌డం, అవ‌స‌రం ఉంద‌ని అడగ‌డంతో నేను రూ.3ల‌క్షలు ఇచ్చా. నా కుమారుడు, కుమార్తె కూడా చెరో రూ.3ల‌క్షల చొప్పున ఇచ్చారు. మొత్తం రూ. 9ల‌క్షలు తీసుకుని ఇప్పుడు రూ.1.60ల‌క్షల‌కు సెటిల్‌మెంట్ చేసుకోవాల‌న్నారు, మేం ఒప్పుకోలేదు. వారి ఇంటి ఎదుట ధ‌ర్నా కూడా చేశాం. గ‌త రాత్రి రాజుగుప్తా ప‌రారైన విష‌యం తెలిసింది. ఇప్పుడు మేం రోడ్డున ప‌డ్డాం. మాకు న్యాయం చేయాలి. -శానం కృష్ణవేణి, బాధితురాలు

Advertisement

Next Story