ప్రస్తుత పరిస్థితులు కొత్త అవకాశం సృష్టించేలా ఉండాలి: కేటీఆర్

by Shyam |
ప్రస్తుత పరిస్థితులు కొత్త అవకాశం సృష్టించేలా ఉండాలి: కేటీఆర్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా ప్రభావం చూపుతున్నా హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతలతో ఐటీ అభివృద్ధి బాటలో నడుస్తుందన్నారు. సోమవారం ప్రగతి‌భవన్‌లో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) కొత్త కార్యవర్గం సభ్యులు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. జాతీయ సగటును మించి భారీగా ఐటీ ఎగుమతులను తెలంగాణ సాధించిందని, అందుకు సీఎం కేసీఆర్ కారణమని సభ్యులు చెప్పారు. ఆరేళ్లుగా ప్రభుత్వ సహకారంతో ఐటీ వృద్ధి చెందిందని ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ప్రస్తుత సంక్షోభం ముగిసిన తర్వాత కంపెనీలు గతంలో ప్రకటించిన భవిష్యత్ ప్రణాళికలపై ముందుకు పోతాయన్న నమ్మకం ఉందన్నారు. ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రభుత్వం, అధికార వర్గాల నుంచి కావాల్సిన సహాయ సహకారాలపై మంత్రి కేటీఆర్‌కు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం హైసీయా వంటి పరిశ్రమ వర్గాలతో కలిసి పనిచేస్తుందని, ఇచ్చిన సలహాలు, సూచనలను సానుకూల దృక్పథంతో స్వీకరించామని గుర్తుచేశారు. వచ్చే రోజుల్లోనూ హైసీయాతో కలిసి ముందుకు నడుస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితులను కొత్త అవకాశాలను సృష్టించే దిశగా స్వీకరించాలని వారికి సూచించారు. గత 2నెలలుగా వీడియో కాన్ఫరెన్స్, ఇతర మాధ్యమాల ద్వారా మెడికల్, ఎడ్యుకేషన్ రంగాల్లో అనేక రకాల కార్యక్రమాలను నిర్వర్తించినట్లు చెప్పారు. కేంద్రం సైతం దేశీయంగా ఉన్న పరిశ్రమలను ఇన్నోవేషన్‌కు మద్దతు ఇస్తామని ప్రకటించిందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఐటీ పరిశ్రమ ప్రతినిధులను మంత్రి కోరారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని అనేక కంపెనీలు నూతన పరిష్కారాలతో ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోందని, వాటికి ప్రభుత్వం తరపున మద్దతు ఇస్తామని మంత్రి తెలిపారు. ఈ మధ్యనే విహజ్ స్టార్ట్ అప్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఆన్‌లైన్ మీటింగ్ సొల్యూషన్‌ను ఐటీశాఖలో అంతర్గత సమావేశాలకు వాడుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story