‘ఆప్’ ఎండార్స్‌డ్ బై అమెరికా!

by Shamantha N |
‘ఆప్’ ఎండార్స్‌డ్ బై అమెరికా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కృషిని బీజేపీ ఢిల్లీ నాయకులు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గుర్తించనప్పటికీ అగ్ర రాజ్య ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ గుర్తించినట్టున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ రాష్ట్రంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన ఎజెండాతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మెలానియా రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌లో విద్యార్థులతో గంట సేపు గడిపారు. బోధనాపద్ధతులను, విద్యార్థుల పరిణతిని ఆమె పరిశీలించారు. హ్యపీనెస్ క్లాసులు పరిశీలిస్తూ దాదాపు గంట పాటు హ్యాపీగా మెలానియా విద్యార్థులతో గడిపారు.

ఇటీవల హోరాహోరీగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అమిత్ షా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ అబద్ధాల్లో కేజ్రీయే ఫస్టనీ, ఆయన చేసిన అభివృద్ధి ఏదీ అంటూ ప్రశ్నించారు. ఎంతో అభివృద్ధి చేశానని ఆప్ అధినేత కేజ్రీవాల్ చెబుతున్నఢిల్లీ స్కూళ్లను బీజేపీ ఢిల్లీ ఎంపీలు పరిశీలించారనీ, కానీ కేజ్రీ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. విద్యా విప్లవమంటూ కేజ్రీవాల్ చేస్తున్నదంతా వట్టిదేనంటూ ఎద్దేవా చేశారు. వీటికి అరవింద్ కేజ్రీవాల్ బదులిస్తూ విద్యను రాజకీయం చేయొద్దనీ, కొద్ది సమయం తీసుకుని తనతో రావాలని అమిత్‌షాను కోరారు. అమిత్‌షా చుట్టూ నెగిటివ్ వ్యక్తులే ఉన్నారనీ, అందుకే స్కూళ్లలో జరిగిన అభివృద్ధి ఆయనకు కనబడనీయడం లేదన్నారు. తనతో కలిసి వస్తే స్కూళ్లకు తీసుకెళ్లి విద్యార్థులతో మాట్లాడిస్తానని చెప్పారు. అయితే, అసెంబ్లీ ఫలితాలు ‘ఆప్’ అనుకూలంగా వచ్చి మళ్లీ కేజ్రీయే సీఎం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెలానియా ఇవాళ కేజ్రీవాల్ అభివ‌ృద్ధి చేసిన స్కూళ్లను పరిశీలించడం గమనార్హం. అక్కడి విద్యార్థులతో ఆమె ముచ్చటించడం మంచి విషయమేననీ, తద్వరా విద్యే ప్రభుత్వాల తొలి ప్రాధాన్యంగా ఉండాలని ఆమె చెప్పకనే చెప్పిందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed