సినీ రంగానికి సహకరిస్తాం: మంత్రి తలసాని

by Shyam |   ( Updated:2020-05-21 03:54:19.0  )
సినీ రంగానికి సహకరిస్తాం: మంత్రి తలసాని
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రముఖనటుడు చిరంజీవి నివాసంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టాలీవుడ్ ప్రముఖులతో గురువారం భేటీ అయ్యారు. కార్యక్రమంలో నాగార్జున, అల్లు అరవింద్, సి.కళ్యాణ్, దిల్‌రాజు, శ్యాంప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, వివి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, ఎన్.శంకర్, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ రాంమోహన్ రావు పాల్గొని లాక్‌‌డౌన్‌లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు మాట్లాడుతూ అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని షూటింగ్‌లు నిలిపివేశామని, దీంతో పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని వారు మంత్రికి వివరించారు. లాక్‌డౌన్ కాలంలో 14వేల మందికి కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. పరిశ్రమలోని సమస్యలను దృష్టిలో ఉంచుకొని పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహణ, సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌‌లో జాగ్రత్తలపై అవుట్ డోర్, ఇండోర్ షూటింగ్‌లకు సంబంధించిన మాక్ వీడియో‌ను ప్రభుత్వానికి సమర్పిస్తామని మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం సినీ పరిశ్రమ పట్ల ఎప్పుడూ సానుకూల ధోరణితోనే ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలోనే హైదరాబాద్ నగరం చిత్రరంగానికి హబ్‌గా నిలిచిందని పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని వెల్లడించారు. షూటింగ్‌ల నిర్వహణ, థియేటర్‌లను తెరిచేందుకు సీఎం కేసీఆర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్క్‌లు, శానిటైజేషన్ ఉపయోగించి, భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మాక్ షూటింగ్ నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed