ఆ పిల్లలు తబలా వాయిస్తే.. వాహ్ అనాల్సిందే!

by Shyam |
ఆ పిల్లలు తబలా వాయిస్తే.. వాహ్ అనాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తబలా వాయిస్తే.. వాహ్ అనకుండా ఉండగలమా? అలానే పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు.. 11 ఏళ్ల రియాన్, 8 ఏళ్ల ఇసాక్‌ తబలా వాయిస్తే.. అలా చూస్తూనే ఉండిపోతాం. చిన్న వయసులోనే అత్యద్భుతంగా తబలా వాయిస్తూ ఆకట్టుకుంటున్న ఈ ఇద్దరినీ చూసి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఫిదా అవుతున్నారు. వీరి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రియాన్ జార్, ఇసాక్ జార్‌ తండ్రికి కూడా తబలా వాయించడమంటే ఎంతో ఇష్టం. దాంతో తన పిల్లలను కూడా చిన్ననాటి నుంచే తబలా నేర్పించాడు. అలా ఏడాది వయసు నుంచే రియాన్ తబలా వాయించడం మొదలు పెట్టాడు. ఇసాక్ కూడా అంతే.. తండ్రి ఒడిలో కూర్చుని తబలా ప్రాక్టీస్ చేసేవాడు. ఈ ఇద్దరు చిన్నారులు ఇంత చిన్న వయసులోనే ఎక్స్‌పర్ట్స్ ప్లే చేస్తున్నట్లు తబలా వాయిస్తుండటంతో.. అన్నిచోట్లా అభినందనలు అందుకుంటున్నారు. రియాన్, ఇసాక్‌లు అటు శాస్త్రీయ సంగీతంతో పాటు ఇటు వెస్టర్న్ సంగీతాన్ని కూడా ఇష్టపడుతుంటారు. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే.. తబలాలో అంతగా ప్రావీణ్యం వస్తుందని వీరు చెబుతుండటం విశేషం. ఇప్పుడు వీరు పాటియాలా ఘరానాకు చెందిన రుస్తుం ఫతే అలీ ఖాన్ అనే ప్రముఖ వాద్యకారుని దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నారు. మహీరా ఖాన్, అజాంసమీ ఖాన్‌ వంటి సెలబ్రిటీలు ఈ చిన్నారుల తబలా వీడియోలకు ముగ్ధులై, సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఎంతోమంది నెటిజన్లు వీరిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed