కనికరం లేని 102సిబ్బంది.. అడవిలో బాలింత.. ఓ వైపు పసికందు మరోవైపు వర్షం..

by Anukaran |   ( Updated:2023-05-01 06:31:17.0  )
కనికరం లేని 102సిబ్బంది.. అడవిలో బాలింత.. ఓ వైపు పసికందు మరోవైపు వర్షం..
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు మానవత్వం మంటగలిసిపోతోంది. బాలింత అని కనికరం కూడా లేకుండా అడవిలో విడిచిపెట్టారు 102 సిబ్బంది. దీంతో చేసేదేంలేక నరకయాతన అనుభవిస్తూ సదరు బాలింత మట్టి రోడ్డులో రాళ్లు రప్పల నడుమ కాలినడకనే తన ఇంటికి చేరుకుంది. ఈ బాధకర ఘటన కొమురంభీం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మొర్లిగూడా గ్రామానికి చెందిన పొర్రెడ్డి కవితకు పురిటినొప్పులు రావడంతో బుధవారం కాగజ్ నగర్ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.

అయితే కవిత పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో నార్మల్ డెలవరీ అయిన కవితను ఆసుపత్రి వైద్యులు ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. కవితను ఇంటికి తరలించడానికి 102 సిబ్బంది వాహనంలో ఎక్కించుకొని బయలుదేరారు. మార్గమధ్యలో పెంచికలపేట మండలం కమ్మర్ గావ్‌లోని అటవీ ప్రాంతంలోనే 102 సిబ్బంది వాహనాన్ని నిలిపివేసి ఇక్కడివరకు మాత్రమే వస్తాం.. ఇక్కడి నుండి నడిచి వెళ్లాలంటూ.. 102 వాహనం నుండి నిర్ధాక్షిణంగా బాలింతను పసికందుతో సహా దించేంశారు.

అంతేకాకుండా ఉచితంగా అందించాల్సిన 102 సేవలకు డబ్బులు కూడా వసూలు చేయడం గమనార్హం. కమ్మర్‌గావ్ నుండి మొర్లిగూడా గ్రామానికి 3కిలోమీట్లర్ల దూరం. ఈ మార్గమంతా మట్టి రోడ్డుపై రాళ్లు తేలి ఉంటాయి. ఇదిలా ఉంటే ఓ వైపు నుండి వర్షం కురుస్తోంది. మరో వైపు నుండి పసికందు ఏడుస్తుంటే ఆ తల్లి మనోవేదన వర్ణన రహితంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడపిల్లలకు ఏ కష్టం రాకుండా ఉండేందుకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ లాంటి పథకాలే కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సైతం నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు. కానీ.. మానవత్వం మరిచిన కొందరు ఇలా చేస్తూ వైద్య సిబ్బందికి తలవంపులు తీసుకువస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed