ట్రంప్ వింత ప్రతిపాదనలపై నిపుణుల ఆగ్రహం

by vinod kumar |
ట్రంప్ వింత ప్రతిపాదనలపై నిపుణుల ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ క్షణంలో ఎలా మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు. ఒక అగ్రదేశానికి అధ్యక్షుడై ఉండి ఒక్కోసారి స్కూల్ పిల్లాడిలా కూడా ఆలోచించరనే అపవాదు ఉంది. దానికి తగ్గట్లే ఆయన అప్పుడప్పుడూ నోరు జారుతుంటారు. కావాలనే చెబుతారో లేదా ఇతరులను పరీక్షించడానికి అంటుంటారో కానీ, రకరకాల మాటలను ప్రజల్లోకి ఇంజెక్ట్ చేస్తుంటారు. అలాంటి సంఘటనే శుక్రవారం చోటు చేసుకుంది. శ్వేతసౌధంలో కరోనా కట్టడి చర్యలపై ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు ట్రంప్. ఆయన కంటే ముందు అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్ సెక్రటరీ బిల్ బ్రియాన్ మాట్లాడారు. సూర్యకాంతి, తేమకు గురైతే కరోనా వైరస్ నాశనం అవుతుందని అన్నారు. సూర్యకాంతి నేరుగా పడితే దాంట్లో ఉండే అల్ట్రా వయెలెట్ కిరణాలు వైరస్‌ను చంపేస్తాయని చెప్పారు. అంతే కాకుండా ఐసోప్రొపైల్ ఆల్కాహాల్ ప్రయోగిస్తే 30 సెకెన్లలోనే వైరస్ చనిపోతుందని చెప్పారు.

ఇక ఈ విషయాలను విన్న ట్రంప్ వింత ప్రతిపాదన తీసుకొని వచ్చారు. కరోనా బారిన పడిన వారి శరీరాల్లోకి ఈ ఐసోప్రొపైల్ ఆల్కాహాల్ ఇంజెక్ట్ చేస్తే ఎలా ఉంటుందని అన్నారు. ఈ క్రిమిసంహార రసాయనం నిమిషాల్లోనే చంపేస్తుందంటున్నారు కదా.. మరి శరీరంలోనికి ఇంజెక్ట్ చేస్తే బాగుంటుంది కదా అన్నారు. అతినీలలోకిత కిరణాలను కూడా మన శరీరంలోనికి ప్రవేశపెట్టే మార్గాలను కనిపెట్టాలని కోరారు. చర్మం ద్వారా కానీ మరే విధానంలోనైనా అల్ట్రావయెలెట్ రేస్ శరీరంలోకి పంపాలని ఆయన సూచించారు. ట్రంప్ ప్రతిపాదనలు విన్న ఆరోగ్య నిపుణులు విస్తుపోయారు. మనిషి శరీరంలోనికి క్రిమి సంహారకాలు ప్రవేశపెట్టడం ఏంటని.. అసలు అల్ట్రావయెలెట్ రేస్ మనిషిని తాకితే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఆయనకు తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. అధ్యక్ష హోదాలో ఉండి ఇలాంటివి చెప్పొద్దని.. ఎవరైనా క్రిమి సంహారక మందు తాగడమో, ఇంజెక్ట్ చేసుకోవడమో చేస్తే ఎవరిది బాధ్యతని ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ చెప్పిన విధానాల వల్ల ప్రాణహాని జరుగుతుందని కొలంబియా విశ్వవిద్యాలయ మెడికల్ సెంటర్ డైరెక్టర్ క్రెగ్ స్పెన్సర్ అన్నారు.

Tags : Corona, Covid 19, Donald Trump, Isopropyl Alcohol, Ultraviolet Ray

Advertisement

Next Story

Most Viewed