పోలీసుల విశిష్ట సేవలకు పతకాలు

by Sumithra |
DGP
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన పోలీసులకు పతకాలు అందించనున్నట్లు రాష్ట్ర హోం శాఖ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. యాంటీ కరప్షన్ బ్యూరో, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్, డీజీపీ కార్యాలయానికి చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఈ అవార్డులను అందించనుంది.

శౌర్య పతకం పొందే వారికి ప్రతి నెలా రూ.500 ఇంక్రిమెంట్ గా అందించడంతో పాటు రూ.10 వేలు లంప్సమ్ గా ఒకసారికి మాత్రమే అందించనున్నారు. మహోన్నత సేవా పతకం కింద రూ.40 వేలు, ఉత్తమ సేవా పతకానికి రూ.30వేలు, కఠిన సేవా పతకానికి రూ.20 వేలు, సేవా పతకానికి రూ.20 వేల లంప్సమ్ ను ఒకసారికి మాత్రమే అందించనున్నారు. డీజీపీ కార్యాలయానికి చెందిన అధికారులు, సిబ్బందిలో గ్రేహౌండ్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఆంజనేయులుకు శౌర్య పతకం దక్కింది.

ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు చెందిన ఎనిమిది మందికి సేవా పతకం దక్కింది. 92 మందికి ఉత్తమ సేవా పతకం, 45 మందికి కఠిన సేవా పతకం, 464 మందికి సేవా పతకం లభించింది. అవినీతి నిరోధక శాఖలో నలుగురికి ఉత్తమ సేవా పతకం దక్కింది. ఐదుగురికి సేవా పతకం లభించింది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగంలో ఇద్దరికి ఉత్తమ సేవా పతకం, ఐదుగురికి సేవా పతకం దక్కింది.

డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ విభాగంలో ఇద్దరికి శౌర్య పతకం, ఒకరికి ఉత్తమ సేవా పతకం, 14 మందికి సేవా పతకం లభించింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో ముగ్గురికి ఉత్తమ సేవా పతకం, 15 మందికి సేవా పతకం దక్కింది. ఇద్దరికి ముఖ్యమంత్రి సర్వోన్నత పతకం ఇద్దరికి దక్కింది. గజ్వేల్ ఏసీపీ పాలకూరి నారాయణ, హైదరాబాద్ చెందిన పోలీస్ కానిస్టేబుల్ రాంరెడ్డికి ఈ అవార్డు లభించింది. వీరికి రూ.5 లక్షలు లంప్సమ్ గా అందిస్తారు.

Advertisement

Next Story

Most Viewed