ఆఖరి క్షణంలో గోల్.. ముంబై గెలుపు

by Shyam |
ఆఖరి క్షణంలో గోల్.. ముంబై గెలుపు
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) సీజన్ 2020-21లో భాగంగా బుధవారం గోవాలోని ఫటోర్డా స్టేడియంలో గోవా ఫుట్‌బాల్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి సిటీ 1-0 తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. గత సీజన్‌లో లీగ్ షీల్డ్ విజేత అయిన గోవా ఎఫ్‌సీ మొదటి నుంచి ముంబయిపై హోరాహోరీగా పోరాడింది. సీజన్ తొలి మ్యాచ్ కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీపై ఓడిన ముంబయి క్లబ్ ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమించింది. టాస్ గెలిచిన ముంబై ఎఫ్‌సీ కుడి నుంచి ఎడమకు ఎటాక్ చేయాలని నిర్ణయించకుంది. తొలి నిమిషం నుంచే ఇరు జట్లు బంతిని తమ నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించాయి. 8వ నిమిషంలో గోవాకు కార్నర్ లభించినా.. దాన్ని గోల్‌గా మార్చలేక పోయింది. ఇరు జట్లు ప్రత్యర్థి గోల్ పోస్టుపై పలు మార్లు దాడి చేసినా.. గోల్ మాత్రం సాధించలేకపోయారు. ఆట మంచి రసపట్టులో ఉన్న సమయంలో ముంబై క్లబ్ ఆటగాడు డేనియల్ సంటానాను గోవా క్లబ్ ఆటగాడు రిదీమ్ టాంగ్ నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకోవడంతో టాంగ్‌పై వేటు పడింది. హాఫ్ సమయానికి ఇరు జట్లు 0-0తో సమంగా ఉన్నాయి.

రెండో అర్థ భాగంలో రెడ్ కార్డ్ కారణంగా గోవా క్లబ్ 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. ఇరు జట్లు గోల్ కోసం ప్రయత్నించినా విఫలమయ్యారు. 90 నిమిషాల ఆట ముగిసిన తర్వాత కూడా ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. అయితే రిఫరీ ఇంజ్యూరీ టైం ఐదు నిమిషాలు ఆటకు కలిపారు. ఈ సమయంలో గోవా చేసిన పొరపాటుకు ముంబై క్లబ్‌కు పెనాల్టీ కిక్ లభించింది. ముంబయి ఆటగాడు ఆడమ్ ఫాంద్రే ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని నేరుగా గోల్ పోస్టులోకి పంపాడు. దీంతో ముంబయి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ గోల్ తర్వాత మరో నిమిషానికే రిఫరీ ఫైనల్ విజిల్ వేయడంతో ముంబయి జట్టు ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది.

ముంబయి సిటీ ఎఫ్‌సీకి క్లబ్ అవార్డు లభించింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు గోడ్డార్డ్‌కు, గోల్ కొట్టిన అడమ్ ఫాంద్రేకు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Advertisement

Next Story