TG Assembly: అసెంబ్లీలో కేటీఆర్ Vs భట్టి.. సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

by Shiva |   ( Updated:2025-03-26 07:48:29.0  )
TG Assembly: అసెంబ్లీలో కేటీఆర్ Vs భట్టి.. సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు చేపట్టిన పనుల్లో 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో ఉన్న నేతలే అసెంబ్లీలో ఆ విషయంపై బహిరంగంగా చర్చించుకుంటున్నారని సభలో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka)తో పాటు మంత్రులు (Ministers), కాంగ్రెస్ సభ్యులు (Congress Members) ఓ రేంజ్‌లో సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ సభ్యులకు వ్యతిరేకంగా సభలో నినాదాలు చేశారు. తాము 30 శాతం కమిషన్లు తీసుకున్నట్లుగా నిరూపించాలని డిప్యూటీ సీఎం భట్టి కేటీఆర్‌కు సవాల్ విసిరారు.

ఒకవేళ నిరూపించని పక్షంలో ఆరోపణలు చేసిన కేటీఆర్ నిండు సభ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లుగా స్పీకర్ ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) ప్రకటించారు. బీఆర్ఎస్‌ (BRS)లా తాము బరితెగించి రాజకీయాలు చేయడం లేదని మల్లు భట్టి విక్రమార్క మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. రూ.40 వేల కోట్ల పనులకు సంబంధించిన బిల్లులను బీఆర్ఎస్ సర్కార్ పెండింగ్‌లో పెట్టిందని.. వాటిని చెల్లించేందుకు నానా ఇబ్బందులు పడుతున్నామని ఆరోపించారు. మైక్ దొరికింది కదా.. అని అడ్డగోలుగా మాట్లాడితే అది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించి అడ్డగోలుగా దోచుకున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భట్టి వ్యాఖ్యలపై కేటీఆర్, బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ కోరగా అందుకు ఆయన నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనకు దిగారు.

Next Story