'అన్నపూర్ణ' భోజనం యధాతథం

by Shyam |
అన్నపూర్ణ భోజనం యధాతథం
X

దిశ, న్యూస్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేస్తున్న ఐదు రూపాయల ‘అన్నపూర్ణ’ భోజనం యధావిధిగా అమలవుతుందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. నగరంలోని పేదలు, ఇతర ప్రాంతాల నుంచి వివిధ రకాల పనులు చేసుకోడానికి వలస వచ్చినవారికి ఐదు రూపాయల భోజనం కడుపు నింపుతోందని, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ జరుగుతున్నా నగరంలో దీన్ని యధాతథంగా కొనసాగించనున్నట్లు మేయర్ స్పష్టం చేశారు. గత నాలుగైదు రోజులుగా జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్ కారణంగా కొన్నిచోట్ల అన్నపూర్ణ భోజన వసతి కొనసాగుతున్నప్పటికీ కొన్నిచోట్ల నిలిచిపోయింది. ప్రజల అవసరాలకు తగినంత మేర అందడంలేదు. అయితే లాక్‌డౌన్ కారణంగా పేదలకు ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటిపట్ల దృష్టి పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

వీరి ఆదేశాల మేరకు నగర మేయర్ బొంతు రామ్మోహన్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నపూర్ణ భోజనాన్ని తయారుచేసే ఇస్కాన్‌కు చెందిన ‘అక్షయపాత్ర’ నిర్వాహకులతో మాట్లాడారు. యధావిధిగా భోజనాన్ని తయారుచేసి సరఫరా చేయాల్సిందిగా ఆదేశించారు. కొన్ని విశ్వవిద్యాలయాల పీజీ హాస్టళ్ళకు కూడా అక్షయపాత్ర నుంచే భోజనం సరఫరా అవుతున్నందున ఆటంకం లేకుండా సప్లయ్ చేయాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. నానక్‌రామ్‌గూడలోని అక్షయపాత్ర సెంట్రల్ కిచెన్‌ను సందర్శించి అక్కడి సౌకర్యాలను కూడా అడిగి తెలుసుకున్నారు. యధావిధిగా భోజనం సమకూరుస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చినట్లు బొంతు రామ్మోహన్ తెలిపారు.

Tags : Hyderabad, Annapurna, Akshaya Patra, Five Rupees Meals, Hotels, Mayor, Deputy Speaker

Advertisement

Next Story

Most Viewed