రైతుబజార్లు తనిఖీ చేసిన మేయర్

by Shyam |   ( Updated:2020-04-04 06:39:31.0  )
రైతుబజార్లు తనిఖీ చేసిన మేయర్
X

దిశ, న్యూస్ బ్యూరో: ఓ వైపు క‌రోనాపై యుద్ధం చేస్తూనే.. మరోవైపు న‌గ‌రంలోని ఎల్బీ న‌గ‌ర్ జోన్‌లో చేపడుతున్న ఎస్‌ఆర్‌డీపీ పనులను నగర మేయర్ బొంతు రామ్మోహన్ శనివారం పరిశీలించారు. లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇక్క‌ట్లు ఉండనందున ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని ఈ సందర్భంగా మేయ‌ర్‌ సూచించారు. కామినేని హాస్పిట‌ల్ ద‌గ్గ‌ర జ‌రుగుతున్న ప్లై ఓవ‌ర్ ప‌నుల‌ను అధికారుల‌తో క‌ల‌సి ప‌రిశీలించారు. ఇక్క‌డ రెండో వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవ‌ర్ ప‌నులు దాదాపు పూర్తి కావ‌స్తున్నందున, ఫ్లైఓవ‌ర్ ప‌క్క‌నుంచి వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అడ్డుగా ఉన్న కామినేని హాస్పిట‌ల్ ప్ర‌హ‌రీగోడ‌ను వెంట‌నే తొల‌గించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. నాగోల్ ఫ్లైఓవ‌ర్ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ అవార్డును ప్ర‌క‌టించాల‌ని అధికారుల‌కు సూచించారు.

రైతు బ‌జార్ల‌ను ప‌రిశీలించిన మేయ‌ర్.. అనంతరం నాగోల్‌లోని పీబీఆర్ ఫంక్షన్ హాల్‌లో పేద‌ల‌కు నిత్యావ‌స వ‌స్తువుల పంపీణీని పర్యవేక్షించారు. ఈ సంద‌ర్భంగా శానిటేష‌న్ సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజ‌ర్ల కొనుగోలుకు నాగోల్ కార్పొరేట‌ర్ సంగీత ప్ర‌శాంత్ గౌడ్ రూ. 25 వేల చెక్కును మేయ‌ర్‌కు అంద‌జేశారు. ప్ర‌స్తుతం ఉన్న మార్కెట్ల‌లో స్థ‌లం త‌క్కువ‌గా ఉన్నందున‌, లాక్‌డౌన్ నేప‌థ్యంలో సోష‌ల్ డిస్టెన్స్‌ను పాటించేందుకు అనుకూలంగా ఉండేలా క్రీడా మైదానాలు, ఫంక్ష‌న్‌హాళ్ల‌లోకి రైతు బ‌జార్ల‌ను మార్చాల‌ని అధికారుల‌కు సూచించారు. అనంతుల రాంరెడ్డి, వీఎం హోమ్ లో ఏర్పాటు చేసిన మార్కెట్‌ను ప‌రిశీలించి వ‌స‌తులపై మేయ‌ర్ సంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఆయనతో పాటు మూసీ రివ‌ర్ ఫ్రంట్ అథారిటీ చైర్మ‌న్‌ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కొప్పుల విఠ‌ల్‌రెడ్డి, ఎం.శ్రీ‌నివాస్‌రావు, జోన‌ల్ క‌మిష‌న‌ర్‌ ఉపేందర్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.

Tags: mayor, ghmc, market, srdp, lockdown, bonthu, cheruku, nagole

Advertisement

Next Story