త్రైమాసిక పన్ను రద్దుకు రవాణా మంత్రి హామీ

by Shyam |
త్రైమాసిక పన్ను రద్దుకు రవాణా మంత్రి హామీ
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఉన్న ముప్పై వేల మ్యాక్సీ క్యాబ్‌లు, కాంట్రాక్టు క్యారేజీ(సీసీ) బస్సులకు మార్చి నెల నుంచి రెండు త్రైమాసికాల పాటు క్వార్టర్లీ పన్ను రద్దు చేయడానికి రవాణా శాఖ ఉన్నతాధికారులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని సీసీ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌ల అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ నిజాముద్దీన్ తెలిపారు. రెండు త్రైమాసికాల పన్ను రద్దుకు కృషి చేస్తానని రవాణా మంత్రి అజయ్ కుమార్ హామీ ఇచ్చినట్లు, ఈ అంశాన్ని రానున్న క్యాబినెట్‌లో చర్చించి ఆమోదింపజేసే దిశగా చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పినట్లు తెలిపారు. సీసీ బస్సులు, మ్యాక్సీ క్యాబుల అసోసియేషన్ ప్రతినిధులతో మంగళవారం హైదరాబాద్‌లోని ట్రాన్స్ పోర్ట్‌భవన్‌లో రవాణా శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రవాణా మంత్రి అజయ్ కుమార్ ఫోన్ ద్వారా పాల్గొన్నారు. జూలైతో ప్రారంభమవుతున్న త్రైమాసిక పన్ను రద్దు చేయాలంటే నిజానికి జూన్ 30వ తేదీలోపే ఆర్సీలు ఇచ్చి వాహనాలు సరెండర్ చేయాల్సి ఉంటుందని, అయితే జూన్ 7‌వ తేదీ నుంచి అన్‌లాక్ 1 ప్రారంభమైనందున జూలై 7వ తేదీ దాకా వాహనాల ఆర్సీలు సరెండర్‌కు సమయమిస్తామని అధికారులు చెప్పినట్లు బస్సుల అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. సోమవారం నాడు బస్సు ఆపరేటర్లు ఒక్కసారిగా బస్సులన్నీ తీసుకొచ్చి ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం మందున్న ప్రధాన రహదారిపై నిలపడం పట్ల ఈ సమావేశంలో మంత్రి అజయ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పన్ను రద్దు చేయడం కుదరదని చర్చలు జరపకుండానే ఉన్నతాధికారులు తెగేసి చెప్పడంతోనే తాము అలా చేయాల్సి వచ్చిందని బస్సు ఆపరేటర్లు మంత్రికి వివరించినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed