- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఢీ..
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021 ఫైనల్ బెర్త్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ – కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. టేబుల్ టాపర్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ తొలి క్వాలిఫయర్‌లో ఓడిపోయి మరోసారి తమ లక్‌ను పరీక్షించుకోనున్నది. మరోవైపు 7 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ పట్టుదలగా ఉన్నది. గత ఏడాది ఢిల్లీ జట్టు ఫైనల్స్ చేరినా.. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ 2014లో చివరి సారిగా ఫైనల్ చేరి టైటిల్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ కేకేఆర్‌కు ఆ అవకాశం రాలేదు.
తాజాగా ఇరు జట్లకు మరోసారి ఫైనల్ చేరేందుకు మరో అవకాశం దొరికింది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరుగనున్న మ్యాచ్‌లో ఇరు జట్ల ఫేట్ తెలిసిపోనున్నది. ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కే కాస్త చాన్స్ ఉన్నట్లు కనపడుతున్నది. ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ దశలో చివరి మ్యాచ్ బెంగళూరుతో ఓడిపోవడమే కాకుండా, తొలి క్వాలిఫయర్‌లో చెన్నై చేతిలో కూడా పరాభవం తప్పలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం యూఏఈలో జరిగిన రెండో దశలో 7 మ్యాచ్‌లు ఆడి 5 గెలిచింది. బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్‌లో అద్బుత ప్రదర్శన చేసి రెండో క్వాలిఫయర్‌లో ప్రవేశించింది.
బ్యాటింగ్ తడబాటు..
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో అంచనాలను మించి రాణించింది. అయితే ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌లో వెన్నెముక అయిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ నిలకడ లేమితో ఉన్నారు. కేవలం వీరిద్దరే కాకుండా ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌లోని బ్యాటర్లందరూ నిలకడగా రాణించలేకపోతున్నారు. తొలి దశలో మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ యూఏఈలో ఇబ్బంది పడుతున్నారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీషా టచ్‌లోకి వచ్చాడు. కానీ అదే ఫామ్ కొనసాగిస్తాడా అనేది ప్రశ్నార్థకరంగా మారింది. షిమ్రోన్ హెట్‌మెయర్ ఈ సీజన్‌లో కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. కానీ గతంతో పోలిస్తే ఈ సీజన్‌లో కాస్త దూకుడు తగ్గింది. బ్యాటింగ్ కాస్త కుదురుకుంటే కానీ పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉన్న కేకేఆర్‌పై ఆధిపత్యం చెలాయించడం కష్టం.
షార్జా స్టేడియంలో కేకేఆర్ జట్టు ఆర్సీబీని ఎలా చిత్తు చేసిందో చూశాము. ఈ రోజు మ్యాచ్ కూడా అదే స్టేడియంలో జరుగనున్నది. మరోవైపు డీసీ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ వికెట్లు తీస్తున్నా, భారీగా పరుగులు ఇచ్చుకుంటున్నాడు. అయితే ఎన్రిక్ నోర్జే పరుగులను కట్టడి చేస్తున్నాడు. కగిసో రబాడ నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. అక్షర్ పటేల్ మంచి ఫామ్‌లో ఉండగా, రవిచంద్రన్ అశ్విన్ పర్వాలేదనిపిస్తున్నాడు. గత మ్యాచ్‌లో ఆడిన టామ్ కర్రన్ బదులు మార్కస్ స్టొయినిస్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నది.
ఆత్మవిశ్వాసంతో కేకేఆర్..
ఆర్సీబీపై విజయంతో కేకేఆర్ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులోని టాప్ 4 బ్యాటర్లు నిలకడగా రాణిస్తున్నారు. ఈ నలుగురిలో ఎవరో ఒకరు మ్యాచ్ బాధ్యతలు తీసుకుంటున్నారు. శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణాలను ఆపడానికి ఢిల్లీ బౌలర్లు కాస్త కష్టపడాల్సిందే. వీరికి తోడు సునిల్ నరైన్ మెరుపులు మెరింపించడానికి సిద్దంగా ఉన్నాడు. అయితే కెప్టెన్ మోర్గాన్ ఫామ్‌లో లేకపోవడం కలవర పెడుతున్నది.
దినేశ్ కార్తీక్ కూడా అంచనాలను అందుకోలేక పోతున్నాడు. టాప్ 4 విఫలమైతే ఎవరు జట్టును ఆదుకుంటారనే విషయంలో చాలా సందిగ్దత ఉన్నది. ఇక బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉన్నది. శివమ్ మావీ, లాకీ ఫెర్గూసన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇక మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. వీరికి తోడు షకీబుల్ హసన్ వంటి ఆల్‌రౌండర్ జట్టులో ఉండటం అదనపు బలం. కానీ ఆర్సీబీపై చేసిన అద్బుతమైన ప్రదర్శనను కేకేఆర్ మరోసారి కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి.
ఢిల్లీ-కోల్‌కతా ఇప్పటి వరకు 28 మ్యాచ్‌లలో తలపడగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 12, కోల్‌కతా నైట్‌రైడర్స్ 15 మ్యాచ్‌లలో గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
జట్ల అంచనా:
ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీషా, రిషబ్ పంత్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, షిమ్రాన్ హెట్‌మెయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, మార్కస్ స్టోయినిస్, అవేశ్ ఖాన్, ఎన్రిక్ నోర్జే
కోల్‌కతా నైట్‌రైడర్స్: శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), షకీబుల్ హసన్, సునిల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావీ, వరుణ్ చక్రవర్తి