8 రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ టెన్షన్.. అప్రమత్తమైన కేంద్రం

by Anukaran |
8 రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ టెన్షన్.. అప్రమత్తమైన కేంద్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశంలోని పదిహేను రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. కానీ ఇందులో ఎనిమిది రాష్ట్రాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం శుక్రవారం సాయంత్రానికి దేశం మొత్తం మీద 7,250 కేసులు మాత్రమే ఉంటే ఒక్క రోజులోనే సుమారు 1600 కొత్త కేసులు పెరిగి.. శనివారం సాయంత్రానికి 8,848 కేసులకు చేరుకున్నాయి. తెలంగాణలో సైతం ఒక్క రోజు వ్యవధిలోనే 260 కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం 350 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నట్లు గుర్తించి వెంటనే 890 ఆంఫొటెరిసిన్ ఇంజెక్షన్లను సప్లయ్ చేయనున్నట్లు పేర్కొన్నది.

ప్రభుత్వం చెప్పే లెక్కలు ఎలా ఉన్నప్పటికీ వాస్తవిక పరిస్థితి మాత్రం అంతకంటే తీవ్రంగా ఉంది. హైదరాబాద్‌లోని ఈఎన్‌టీ ఆస్పత్రిని బ్లాక్ ఫంగస్ కేసుల కోసం నోడల్ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులోని 202 బెడ్‌లు పూర్తిస్థాయిలో నిండిపోవడంతో కొత్తగా వచ్చే పేషెంట్లకు అడ్మిషన్లు ఇవ్వడం వైద్యులకు సవాలుగా మారింది. అదనపు బెడ్‌లు సమకూర్చాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ, అధికారిక లెక్కల ప్రకారం మాత్రం 127 మంది ఇన్-పేషెంట్లు ఉన్నారని, ఇంకా 73 బెడ్‌లు ఖాళీగా ఉన్నట్లు ప్రకటనలు వస్తున్నాయి. వీరు మాత్రమే కాకుండా ఇంకా ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స పొందుతున్న పేషెంట్లు కూడా ఉన్నారు.

ఎనిమిది రాష్ట్రాల్లో తీవ్రం..

కేంద్ర మంత్రి సదానంద గౌడ అన్ని రాష్ట్రాల్లోని బ్లాక్ ఫంగస్ కేసుల్ని గుర్తించి చికిత్సకు అవసమైన ఇంజెక్షన్లను సప్లయ్ చేయడానికి అధికారులతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఆ ప్రకారం అత్యధికంగా గుజరాత్ రాష్ట్రంలో 2,281, మహారాష్ట్రలో 2,000, ఆంధ్రప్రదేశ్‌లో 910, మధ్యప్రదేశ్‌లో 720, రాజస్థాన్‌లో 700, కర్నాటకలో 500 చొప్పున కేసులు ఉన్నాయి. అత్యధిక కేసుల్లో తెలంగాణ ఏడవ స్థానంలో ఉంది. అన్ని రాష్ట్రాల్లో నమోదైన 8,848 బ్లాక్ ఫంగస్ కేసుల్ని దృష్టిలో పెట్టుకుని తక్షణం 23,680 ఆంఫొటెరిసిన్ ఇంజెక్షన్లను పంపుతున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ డోసుల్ని పంపే విధంగా మొత్తం ఎనిమిది రాష్ట్రాలకే దాదాపు 75% మేర స్టాకును సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న స్టాకుకు అదనంగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడంపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఒకవైపు దాన్ని ఎపిడమిక్ జాబితాలో చేర్చడంతో పాటు అవసరాలకు తగినంతగా ఉత్పత్తిని పెంచడం కోసం పదకొండు ఫార్మా కంపెనీలకు ఆంఫొటెరిసిన్ ఇంజెక్షన్లను తయారు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఇంజెక్షన్లను తగిన మోతాదులో వినియోగించడం ద్వారా మాత్రమే మృతులను అదుపు చేయవచ్చని, రోగాన్ని నయం చేయడం ద్వారా ఇతరులకు ఇన్‌ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తపడవచ్చని కేంద్రం భావిస్తోంది.

ఇతర ఆస్పత్రులకు రిఫరెన్స్..

బ్లాక్ ఫంగస్ బారిన పడిన తర్వాత వెంటనే చికిత్సను మొదలుపెట్టాల్సిన అవసరాన్ని గుర్తించిన వైద్యులు ఆంఫొటెరిసిన్ ఇంజెక్షన్‌ కోసం తిప్పలు పడుతున్నారు. ఈఎన్‌టీ ఆస్పత్రి వైద్యుడు ఒకరు మాట్లాడుతూ.. ప్రస్తుతం 300 ఇంజెక్షన్లు మాత్రమే ఉన్నాయని, కానీ పేషెంట్లు మాత్రం 200 మందికి పైగా ఈ ఒక్క ఆస్పత్రిలోనే ఉన్నారని, వారందరికీ పరిమిత స్టాకుతో సర్దడం ఇబ్బందిగా మారిందన్నారు. కొత్తగా వచ్చే పేషెంట్లకు బెడ్‌లను, ఇంజెక్షన్లను సమకూర్చడం ఇక్కడ పనిచేస్తున్న వైద్యులకు కష్టసాధ్యంగా ఉందని తన ఆవేదనను తెలిపారు. కొత్తగా వస్తున్న పేషెంట్ల సీరియస్ కండిషన్‌ను బట్టి గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నామని, అడ్మిషన్ అవసరం లేనివారిని ఆయుర్వేద, హోమియో మందులను వాడాలని నచ్చచెప్తున్నామని వివరించారు.

ఒకవైపు ఆస్పత్రిలో బెడ్‌లు నిండిపోవడమే కాకుండా వారందరికీ వెంటవెంటనే చికిత్స అందించడానికి సరిపోయేంత మెడికల్ స్టాఫ్ లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ మాట్లాడుతూ.. కేవలం నర్సింగ్ స్టాఫ్ మాత్రమే కాక డ్యూటీ డాక్టర్లకు కూడా కొరత ఉందని, ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించామని, త్వరలో సర్దుబాటు చేస్తామనే సానుకూల స్పందన వచ్చిందని పేర్కొన్నారు. బెడ్‌ల సంఖ్యను కూడా పెంచాల్సి వస్తుందని, ఇదే విషయాన్ని ప్రతిపాదించామని తెలిపారు.

పాజిటివ్ ఉంటే గాంధీకి..

బ్లాక్ ఫంగస్ బారిన పడిన పేషెంట్లకు తక్షణ చికిత్స ఇవ్వాల్సి వస్తే ఈఎన్‌టీ ఆస్పత్రిలోని బెడ్‌ల కొరతను దృష్టిలో పెట్టుకున్న డాక్టర్లు మరో మార్గం లేక వారిని గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నారు. అడ్మిషన్ కోసం వచ్చే పేషెంట్లకు కరోనా పాజిటివ్ ఉందో లేదో నిర్ధారించే రిపోర్టును తీసుకురావాల్సిందిగా షరతు విధిస్తున్నారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అడ్మిషన్లకు వస్తే ఇప్పటికిప్పుడు లాబ్‌కు వెళ్ళి ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకుని నెగెటివ్ రిపోర్టును తీసుకురావడం సాధ్యమేనా అని పేషెంట్ బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకున్న తర్వాత మూడు రోజులకు రిపోర్టు వస్తే అప్పటిదాకా పేషెంట్ సంగతేంటనే ప్రశ్నకు వైద్యుల నుంచి సమాధానం లేదు.

పాజిటివ్ ఉన్న పేషెంట్లకు గాంధీలో చికిత్స ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినందున ఆ రిపోర్టు కోసం కూడా పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. పాజిటివ్ రిపోర్టు ఉంటే మాత్రమే అడ్మిషన్ తీసుకుంటామని గాంధీ ఆస్పత్రి డాక్టర్లు షరతు పెడుతున్నారు. కరోనా పేషెంట్ల విషయంలో పాజిటివ్, నెగెటివ్ రిపోర్టు అవసరం లేకుండా పేషెంట్ కండిషన్‌ను బట్టి అడ్మిట్ చేసుకుంటుండగా అంతకంటే సీరియస్‌గా ఉన్న బ్లాక్ ఫంగస్ విషయంలో మాత్రం ఈ షరతులేంటని పేషెంట్ల సహాయకులు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈఎన్‌టీ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన పేషెంట్లకు ఒక్క శనివారం రోజునే సుమారు 230 ఆంఫొటెరిసిన్ ఇంజెక్షన్లను వాడినట్లు సమాచారం. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త స్టాకు కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. స్వల్ప మోతాదులో లక్షణాలు ఉన్నవారికి ఆయుర్వేద, హోమియో మందులను వాడాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ బారిన పడిన పేషెంట్ల సంఖ్య దాదాపు 1500 ఉండవచ్చునని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం 90 మంది మాత్రమే ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లు శుక్రవారం తెలిపినప్పటికీ శనివారం ఉదయానికి కేంద్ర మంత్రే 350 మంది పేషెంట్లు ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed